Rythu Bharosa (Image Source: AI)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Rythu Bharosa: రైతు భరోసాలో షాకింగ్ నిజాలు.. ప్రభుత్వ సాయం కొందరికేనా?

Rythu Bharosa: వానాకాలం సీజన్‌కు ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందించి రైతులకు గొప్ప ఊరటనిచ్చింది. ఖాతాల్లో డబ్బులు పడ్డ రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా, కొందరికి సాయం అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఔటర్‌ రింగు రోడ్డు వెంట ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 83,251 ఎకరాలకు పెట్టుబడి సాయం డబ్బులు రాలేదు. సాగుకు యోగ్యం కాని భూములుగా అధికారులు రికార్డుల్లో నమోదు చేయడం వల్లనే ఖాతాల్లో డబ్బులు జమ కానట్లు తెలుస్తోంది. దీంతో డబ్బులు అందని రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సాయం కోసం తప్పని ఎదురు చూపులు
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌‌మెట్‌, హయత్‌ నగర్‌, ఇబ్రహీంపట్నం, బాలాపూర్‌, మహేశ్వరం, శంషాబాద్‌, రాజేంద్ర నగర్‌, గండిపేట్‌, శేరిలింగంపల్లి మండలాల్లో రైతు భరోసా సాయం రాలేదు. ఆయా మండలాల్లోని 36,220 మంది రైతులకు సంబంధించి 38,184 ఎకరాలకు 22.91 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మేడ్చల్‌ జిల్లాలో మేడ్చల్‌, శామీర్‌ పేట్‌, కీసర, ఘట్‌ కేసర్‌, దుండిగల్‌, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌ మండలాల్లోని 45,067 ఎకరాలకు సంబంధించిన సుమారు 49,727 మంది రైతులకు రూ.27.40 కోట్ల సాయం అందాల్సి ఉంది. మూడు చింతలపల్లి మండలంలోనూ కొందరికే రైతు భరోసా డబ్బులు పడ్డాయి. వానాకాలం సీజన్‌లో సమృద్దిగా వర్షాలు కురవడంతో పంటల సాగుపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం సైతం సకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వడంతో పెట్టుబడులకు ఇబ్బందులు తీరుతాయని రైతాంగం భావించింది. అయితే, భరోసా డబ్బులు కొందరికే రావడంతో మిగతా రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు.

అసలు ఏం జరిగింది?
సాగు భూములకే ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగు భూముల లెక్కలను తేల్చారు. ఓఆర్‌ఆర్‌ వెంట ఉన్న మండలాలు, మున్సిపాలిటీల్లో సర్వే నెంబర్లను యూనిట్‌గా తీసుకుని రైతు భరోసాకు ప్రణాళిక రూపొందించారు. ఒక సర్వే నెంబర్‌లో ఒక ప్లాటున్నా మొత్తం భూమిని ప్లాట్ల కింద నమోదు చేశారు. దీంతో ఆయా భూములు సాగుకు యోగ్యం కావని రికార్డుల్లో నమోదై రైతు భరోసా సాయం అందకుండా పోయింది. ఎన్నో ఏండ్లుగా ఆయా భూముల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేసుకుంటుండగా, కొంతమంది ఆకుకూరలు, కూరగాయలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధికారులు చేసిన తప్పిదాల వల్లనే చాలామంది రైతులు అర్హులైనప్పటికీ పెట్టుబడి సాయానికి దూరమయ్యారు.

Also Read: Air india Plane Crash: మాకు ఆ సీటే కావాలి.. డబ్బు ఎంతైనా చెల్లిస్తాం.. విమాన ప్రయాణికులు!

మంత్రి తుమ్మలకు ఏకరువు
రైతు భరోసా సాయం అందక గగ్గోలు పెడుతున్న రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకెందుకు డబ్బులు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. గురువారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ప్రకారం, అర్హులైన వారందరికీ రైతు భరోసా సాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. ఇక, మేడ్చల్‌ జిల్లాలోనూ బాధిత రైతులు డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్‌ మధుకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి రైతులందరికీ రైతు భరోసా సాయం వచ్చేలా చూడాలని, లేనిపక్షంలో ఆందోళన చేయక తప్పదని రైతాంగం ఈ సందర్భంగా హెచ్చరించింది.

Also Read This: Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోరం.. భర్త, మరిది వేధింపులు.. కోపంతో యువతి ఏం చేసిందంటే?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు