RTC JAC leaders: క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఒక ప్రకటన విడుదల చేశారు. చట్ట వ్యతిరేకంగా నియమించిన వెల్ఫేర్ కమిటీలను రద్దుచేయాలని, యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేయాలని, కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని, అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలని, మహాలక్ష్మి పథకం వలన కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ సర్క్యులర్ 1/2019 ను తెలంగాణ ఆర్టీసిలో కూడా అమలు చేయాలనికోరారు.
Also Read: MLC Kavitha: రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు.. ఏం తప్పు చేశారని ఇచ్చారు?
ఆర్టీసీ సంస్థనే నేరుగా కొత్త నియామకాలను చేపట్టాలి
మహాలక్ష్మి ప్రయాణీకులకు ఉచిత బస్ పాస్ కార్డు జారీ చేయాలని, 2021, వేతన సవరణను ప్రభుత్వ ఉద్యోగుల కంటె ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు 28 శాతం తక్కువ ఉన్నందున ఆర్టీసీ ఉద్యోగులకు 30 శాతానికి తగ్గకుండా వేతన సవరణ అమలు చేయాలని కోరారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు చేయాలని, గ్యారేజీ , రన్నింగ్ సెక్షన్ లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ నియామకాలను పూర్తిగా ఎత్తివేసి ఆర్టీసీ సంస్థనే నేరుగా కొత్త నియామకాలను చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 3,038 ఉద్యోగ నోటిఫికేషన్ లో కండక్టర్లు, క్లరికల్ సిబ్బంది నియామకాలను కూడా ఆ నోటిఫికేషన్ లో చేర్చాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, కో ఛైర్మన్ కె.హన్మంతు ముదిరాజ్, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి ఉన్నారు.
Also Read: Anganwadi Jobs: త్వరలోనే అంగన్వాడీల్లో.. 14వేల ఖాళీలు భర్తీ!