Bus Seat Dispute:
మేడ్చల్, స్వేచ్ఛ: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో జనాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రయాణ సమయాల్లో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కిక్కిరిసిన బస్సుల్లో సీటు దొరక్క ప్రయాణికుల మధ్య ముష్టిఘాతాలకు (Bus Seat Dispute) దారితీస్తోంది. పరస్పరం పిడిగుద్దుల దాడులు జరుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మరో ఘటన వెలుగుచూసింది.
మేడ్చల్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఓ డ్రైవర్, కండక్టర్‌పై శుక్రవారం దాడి జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన ఈ దాడికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం మేడ్చల్ డిపో నుంచి బస్సు బయలుదేరి కొంపల్లి వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో, సీనియర్ సిటిజన్‌కు కేటాయించిన సీట్లో సీఎంఆర్ కాలేజీ విద్యార్థిని కూర్చుంది. అయితే, సీటు తమకు ఇవ్వాలని బస్సు ఎక్కిన సీనియర్ సిటీజన్ కోరారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సీటు ఇవ్వడానికి విద్యార్థిని అంగీరించకపోవడంతో వెనుక్కి వెళ్లి మరొకరు సీటు ఇస్తే కూర్చున్నారు.
Read Also- IFFI 2025: ‘సంక్రాంతికి వస్తున్నాం’కు అంతర్జాతీయ గౌరవం.. ఇండియన్ పనోరమాకు ఎంపిక
అయితే, అంతలోనే విద్యార్థిని ఫోన్ ద్వారా సమాచారాన్ని తనవారికి చేరవేసింది. దీంతో, ఇద్దరు వ్యక్తులు వచ్చి బస్సును ఆపి, కండక్టర్ ఉదయ్ కిరణ్‌ను దుర్భాషలాడారు. చేయిచేసుకున్నారు. కండక్టర్ అయ్యప్పస్వామి వారి మాలధారణలో ఉన్నా చూడకుండా కొట్టారు. అంతేకాకుండా, అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో డ్రైవర్ గానీ, కండక్టర్‌కు గానీ ఎలాంటి సంబంధం లేకున్నా దాడి చేశారని బాధితులు చెప్పారు. కాగా, దాడి చేసిన వ్యక్తులపై పేట్‌బషీరాబాద్ పోలీసే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చర్చనీయాంశమవుతున్న ఘటనలు
కాగా, మేడ్చల్ ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లపై దాడి జరగడం వారం రోజుల్లో ఇది రెండవ ఘటన కావడం గమనార్హం. చిన్నపాటి విషయాలకే దాడులు జరుగుతుండటం ఆర్టీసీ ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతయ్య అనే డ్రైవర్‌ను 2 రోజుల కిందట పలువురు విచక్షణా రహితంగా కొట్టారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను సంస్థ ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులపై పోలీస్ అధికారులు స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
Read Also- Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్
