H-Citi Project: టెండర్లు సరే.. పనుల మాటేంటీ?
సీఎం శంకుస్థాపన చేసి తొమ్మిది నెలలు
ముందుకు కదలని హెచ్ సిటీ పనులు
జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ నిర్లిప్తతే కారణమా?
ఇప్పటివరకు ఒక్క పనిని క్షేత్ర స్థాయిలో పరిశీలించని చీఫ్ ఇంజనీర్
సర్కారు వద్ద పెండింగ్ లో కేబీఆర్ పార్కు పనుల ఏజెన్సీ ఎంపిక
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మహానగరంలో ప్రత్యక్ష నరకంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ (H-Citi Project) పనులు ఇప్పట్లో గాడిన పడే పరిస్థితి కన్పించటం లేదు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, నానల్ నగర్ తదితర రద్దీ ప్రాంతాల్లో చేపట్టాల్సిన హెచ్ సిటీ పనులకు జీహెచ్ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియపై చూపుతున్న శ్రద్ధను, పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లటంపై చూపటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సర్కారు హయాంలో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ (ఎస్ఆర్ డీపీ)-1 కింద పలు పనులను చేపట్టగా, మిగిలిన పనులను హెచ్ సిటీ-2 కింద ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత సర్కారు మారటంతో ఎస్ఆర్ డీపీని కాస్త హైదరాబాద్ సిటీ ఇన్నోవేటీవ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటీవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ( హెచ్ సిటీ) మార్చారు. ఈ హెచ్ సిటీ కింద మొత్తం రూ.5,942 కోట్లను మంజూరు చేస్తూ సర్కారు గతేడాది డిసెంబర్ 5న జీవో 627 ను జారీ చేసింది. వీటితో పాటు కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన మరో రూ. 1,090 కోట్ల పనులకు కూడా సర్కారు మంజూరీ ఇచ్చిన కొద్ది రోజులకే హెచ్ సిటీ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టనున్న హెచ్ సిటీ పనులకు నిధులను కూడా ఇచ్చేందుకు సర్కారు సిద్దంగా ఉన్నా, పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లటంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం విఫలమవుతున్నట్లు విమర్శలున్నాయి.
చీఫ్ ఇంజనీర్ జోడు పదవుల జోరు
సిటీలో చేపట్టనున్న హెచ్ సిటీ పనులకు చీఫ్ ఇంజనీర్ గా వ్యవహారిస్తున్న అధికారి ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ విభాగానికి కూడా ఇంజనీర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ పనులను ముందుకు తీసుకెళ్లటంపై చూపే శ్రద్ధ కన్నా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ పదవీని కాపాడుకునేందుకు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలున్నాయి. దీంతో సీఎం శంకుస్థాపన చేసిన హెచ్ సిటీ పనులపై పర్యవేక్షణ లోపించటం వల్లే హెచ్ సిటీ పనులన్నీ కేవలం టెండర్ల ప్రక్రియకే పరిమితయమ్యాయన్న వాదనలున్నాయి. ఈ పనులకు సీఎం శంకుస్థపాన చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా, ఒక్క హెచ్ సిటీ పనిని కూడా చీఫ్ ఇంజనీర్ ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో తనిఖీ గానీ, పరిశీలన గానీ చేయకపోవటం హెచ్ సిటీ పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
టెండర్లపై ఉన్న శ్రద్ధ పనులపై ఏదీ?
సర్కారు ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టనున్న హెచ్ సిటీ పనుల విషయంలో జీహెచ్ఎంసీ వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టెండర్ల ప్రక్రియపై చూపుతున్న శ్రద్ధను పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లటంపై చూపటం లేదన్న విమర్శలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయక ముందు నుంచే జీహెచ్ఎంసీ కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు రూ. 1,090 కోట్లతో చేపట్టనున్న ఆరు స్టీల్ బ్రిడ్జిలు, ఆరు అండర్ పాస్ ల రూపకల్పన చేసిన ప్రతిపాదనలకు నెలన్నర రోజుల క్రితం ఎంతో హడావుడిగా టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. కేబీఆర్ చుట్టూ చేపట్టాల్సిన పనులకు సంబంధించిన తక్కువగా కోడ్ చేస్తూ ఇంటర్నేషనల్ టెండర్లను సమర్పించిన రెండు ఏజెన్సీలను ఎంపిక చేసి అధికారులు సర్కారు అనుమతి కోసం సుమారు నెలన్నర రోజుల క్రితం ఆమోదం కోసం సర్కారుకు పంపగా, ఇంకా పెండింగ్ లోనే ఉంది.
కేబీఆర్ పార్కు హెచ్ సిటీ పనులపై వివాదాలు
కేబీఆర్ పార్కు ఎకో సెన్సిటీవ్ జోన్ అని, హెచ్ సిటీ పనులతో జీహెచ్ఎంసీ పార్కులోని పచ్చదనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తందని కొందరు, స్థల సేకరణను సవాలు చేస్తూ మొత్తం మూడు వివాదాలు కోర్టు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కానీ కోర్టులో వివాదాల్లేని ప్రాంతాల్లో పనులు మొదలు పెడతామని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గడిచిన నెలన్నర రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. దీనికి తోడు సిటీలో నిత్యం రద్దీ గా ఉండే మెహిదీపట్నం నానల్ నగర్ నుంచి కర్ణాటక, ముంబై హైవే కు చేరుకునే మెయిన్ రోడ్డు అయిన నానల్ నగర్ లో కూడా రూ. 400 కోట్ల తో నిర్మించనున్న మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ కు జీహెచ్ఎంసీ హడావుడిగా టెండర్ల ప్రక్రియను చేపట్టనుంది. ఇక్కడ మిలిటరీ బసంతర్ హౌజ్ లోని రక్షణ శాఖకు చెందిన స్థలంలో హుమాయున్ నగర్ ఫిల్డర్ బెడ్ నుంచి మొదలయ్యే ఈ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ కు స్థల సేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోయినా, జీహెచ్ఎంసీ టెండర్ల ప్రక్రియ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
Read Also- Viral Video: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ముగ్గురూ పోలీసులే!
స్థలాలను కాపాడుకునే ప్రయత్నాలు
కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పను కోసం జీహెచ్ఎంసీ మొత్తం 269 ఆస్తులను గుర్తించగా, వీటిలో ఇప్పటికే జీహెచ్ఎంసీ 105ఆస్తులకు మార్కింగ్ చేసింది. వీటిలో ప్రస్తుత సర్కారులో ఉన్నతమైన హోదాలో కొనసాగుతున్న నేతకు చెందిన సుమారు 82.22 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ఆస్తి నుంచి 265.58 చదరపు గజాలు, ఓ సీనీ నటుడి బంధువులకు చెందిన ఆస్తి నుంచి సుమారు 204.77 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, స్థల సేకరణను సవాలు చేస్తూ సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆయన బాటలోనే అధికార పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. మరో సినీ నిర్మాత కు చెందిన ఆస్తి నుంచి 133.77 చదరపు గజాలు, మరో సీనీ నటుడికి చెందిన ఆస్తి నుంచి 377.66 చదరపు గజాలు, అలాగే ఓ టీవీ చానెల్ అధినేతకు చెందిన ఆస్తి నుంచి 479.22 చదరపు గజాల స్థలాల్ని సేకరించాల్సి ఉండగా, స్థలాలిచ్చేందుకు వీరంత సిద్దం లేరని తెల్సింది. కేబీఆర్ పార్కుచుట్టూ చేపట్టనున్న హెచ్ సిటీ -1 పనులకు స్థలాలిచ్చే ఇష్టం లేని కొందరు బడా బాబులు, వ్యాపారులు పరోక్షంగా పనులను అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ వ్యాపారికి చెందిన ఆస్తి నుంచి సుమారు 30 అడుగుల స్థలాన్ని సేకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేసినా, తనకు అనుకూలంగా మార్కింగ్ మార్చేందుకు వీలుగా సదరు వ్యాపారి జీహెచ్ఎంసీ అధికారులతో డీల్ కుదుర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పార్కుచుట్టూ నిర్మించే హెచ్ సిటీ -1 పనులకు సంబంధించి ఓ మాజీ మంత్రితో కలిసి సదరు వ్యాపారి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజీకీయ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అలైన్ మెంట్ మార్పు, స్థల సేకరణ నుంచి ఆస్తులు కాపాడాలంటూ వస్తున్న వత్తిళ్లను తట్టుకోలేక జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పనులు చేపట్టేందుకు కావల్సిన స్థాయిలో ఇంజనీర్లు అందుబాటులో లేరంటూ విషయాన్ని సాకుగా చూపుతూ పనులు చేపట్టేందుకు వెనకంజ వేస్తున్నట్లు చర్చ జరుగుతుఆంది. బడాబాబులు వత్తిడి తలొగ్గి సర్కారు అలైన్ మెంట్ ను మార్చుతుందా? లేక ఇప్పటికే ఆలస్యమైన హెచ్ సిటీ పనుల స్థల సేకరణకు ఎవరికెలాంటి మినహాయింపులివ్వక స్థల సేకరణను వేగవంతం చేస్తుందా? వేచి చూడాలి.