KGBV Schools: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థినుల కోసం కొనుగోలు చేస్తున్న బంకర్ బెడ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగినట్లు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) అసోసియేషన్ ఆరోపించింది. రూ.170 కోట్ల టెండర్లలో ఏకంగా రూ.100 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్లు ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
కేజీబీవీ పాఠశాలలకు బంకర్ బెడ్స్ సప్లై పేరుతో నిర్వహించిన ఈ టెండర్‌లో ఎంఎస్ఎంఈలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన 20 శాతం వాటాను నిర్లక్ష్యం చేశారని, తెలంగాణలోనే బంకర్ బెడ్స్ తయారీదారులు ఉన్నా కూడా వారిని పక్కనబెట్టి ఒక బడా కంపెనీకి కావాలని కట్టబెట్టారని అసోసియేషన్ ఆరోపించింది. ఢిల్లీకి చెందిన మెతోడెక్స్ అనే కంపెనీకి టెండర్లు దక్కేలా చేశారని పేర్కొంది. అదే కంపెనీకి చెందిన ఇద్దరు డీలర్లు, ట్రూఫా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మాఫత్ లాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఒకే కంపెనీ డీలర్‌షిప్‌తో బిడ్ చేసినా కూడా రూ.170 కోట్ల ఆర్డర్‌ను వారికే అప్పగించడం రాష్ట్ర పరిశ్రమలను ఎదగనివ్వకుండా చేస్తున్నారని పేర్కొంది.
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
ఇది టెండర్ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందని అసోసియేషన్ పేర్కొంది. అనుభవం లేని సంస్థకు టెండర్ ఇచ్చారని ఆరోపించింది. ఇందులో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) డైరెక్టర్ చక్రం తిప్పినట్లు ఆరోపించింది. ట్రూఫా ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ఎంఈఐఎల్ డైరెక్టర్ బొంతు శ్రీనివాస్ రెడ్డి కొడుకుకు చెందినదని, ఈ సంస్థ కేవలం 2022లో మాత్రమే రిజిస్టర్ అయిందని, టెండర్ నిబంధనల ప్రకారం కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉండాలనే నిబంధనను ఉల్లంఘించారని పిటిషనర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.13 వేలుగా ఉన్న ధర ఏకంగా రూ.22 వేలు పెరిగి, అది కాస్త రూ.33,860కు చేరిందని ఆరోపించింది.
Also Read: Gender Equality: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు బడుల్లో కీలక మార్పులు
కోర్టు మెట్లెక్కిన అసోసియేషన్
తొలి ఒప్పందం ప్రకారం 120 రోజుల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, ఆ గడువు ముగిసిన ఆరు నెలల తర్వాత అదే కంపెనీలతో మళ్లీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ పేరుతో కొత్త ఒప్పందాలు చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టీల్ అండ్ వుడెన్ ఫర్నీచర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. సంబంధిత శాఖ అధికారులు జేబులు నింపుకునే పనిలో ఉన్నారని తెలిపింది.
అనుభవం లేని బడా వ్యాపారవేత్త కుమారుడి కంపెనీకి దక్కేలా ధరలు నిర్ణయించి, గుత్తేదారులకు అనుకూలంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు రూ. 100 కోట్ల భారీ నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, న్యాయస్థానం ‘స్టేటస్ కో’ నిర్వహించాలని ఆదేశించింది. దీనితో టెండర్‌కు సంబంధించిన సప్లై పనులు ఆగిపోయినట్లుగా ఎంఎస్ఎంఈ పేర్కొంది. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని ఎంఎస్ఎంఈ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Also Read: Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

