Eagle Squad: మిస్సైల్ లా పేలక పోవచ్చు. తూటాలా దూసుకు పోకపోవచ్చు. కానీ..ఈ ఆయుధం అన్నింటికంటే పవర్ ఫుల్. అదే ‘గరుడ’ అస్త్రం. కండ్ల ముందు జరిగే యుద్దం విషయంలో ఎంత అప్రమత్తత అవసరమో!..కంటికి కనిపించని శత్రువుల కదలికలపై అంతకంటే అప్రమత్తత అవసరం. ఈ నేపథ్యంలోనే ‘గరుడ దళం’ తెలంగాణ పోలీసుల చేతికి కొత్త అస్త్రంగా మారబోతున్నది.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖ గరుడ దళాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు సంబంధించి డేగలకు మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ) ఇస్తున్న శిక్ష ముగింపు దశకు వచ్చింది. అనుమానాస్పద డ్రోన్లను ధ్వంసం చేయడం వీటి ప్రత్యేకత. త్వరలోనే ‘ఈగల్ స్కాడ్’ పేరుతో పోలీసు శాఖలో సేవలందించేందుకు 4 డేగలు సిద్దమవుతున్నాయి.
గగనతలం నుంచి నిఘా..
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో విధ్వంసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సాంకేతిక డ్రోన్స్‌తో భద్రతకు ముప్పు పెరిగిపోతున్నది. గగనతలంలో ఎగినే డ్రోన్లను వినియోగించి టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ముప్పును తిప్పికొట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే తొలిసారిగా ఈగల్ స్వ్యాడ్‌ను వినియోగించేందుకు సన్నద్దమవుతోంది.
2019 సంవత్సరంలోనే ఇందుకు కార్యాచరణ మొదలైంది. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లో జీవించే మేలురకం డేగలను చిన్నతనంలోనే అకాడమీకి తరలించి గత నాలుగేండ్లుగా ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్స్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం నాలుగు డేగలకు మొయినాబాద్‌లోని ఐఐటీఏలో అధునాతన శిక్షణను ఇచ్చారు.
గగనతలంలో నిఘాను ఉంచి అనుమానాస్పద డ్రోన్లను గుర్తించి నేలకూల్చడంలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. డేగలకు జీపీఎస్ ట్రాకర్..మెడ, కాళ్లు, రెక్కలకు మైక్రో కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా ద్వారా డ్రోన్లను కట్టడి చేస్తారు. ప్రపంచంలోనే ఇలాంటి డేగలు ఒక నెదర్లాండ్స్‌లోనే ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లపై అలర్ట్.. మిమ్మల్ని మామూళ్లు అడుగుతున్నారా?
డేగలే ఎందుకంటే..
గగనతలంలో నిఘా కోసం పావురాలకు శిక్షణ ఇవ్వాలని తొలుత భావించారు. అయితే అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగల వైపు దృష్టి పెట్టారు. ఆకాశంలో నుంచి భూమిపై ఉన్న కోడి పిల్లలను సైతం డేగలు పసిగట్టగలవు. డేగలు తుఫాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులోకి వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి. ఒక్కో డేగ రెండు కిలోల వరకు బరువును మోయగలుగుతాయి.
నిఘాలోనూ వీటిది ప్రత్యేక స్థానం. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన డేగల సేవలను డ్రోన్ల కట్టడికి ఉపయోగించుకోవాలని భావించిన పోలీసు శాఖ వాటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు, జాగిలాలు వంటి అనేక వ్యవస్థలు ఉండగా…రానున్న రోజుల్లో గరుడ దళం సైతం కీలకపాత్ర పోషించనున్నది. వీఐపీల భద్రతతోపాటు మావోయిస్టు ఆపరేషన్లకు, వారి కదలికలను పసిగట్టేందుకు కూడా గరుడ స్క్వాడ్‌ను వినియోగించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.