Minister Sridhar Babu: దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడుతూ.. దేశ రక్షణ కోసం జరుగుతున్న యుద్ధానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రాష్ట్ర ప్రజలు అందరూ భారత ప్రభుత్వం వెంటనే ఉంటారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ, కొత్తూరు ఉమ్మడి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన పరాక్రమానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఎంతో సాహసోపేతంగా ఆర్మీ జవానులు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని అన్నారు. కోట్లాదిమంది భారతీయులు భారత్ వెంట అండగా నిలుస్తారని ఆయన అన్నారు. దేశ సమగ్రత కాపాడడం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారని ఆయన వెంట తాము కూడా దేశ రక్షణలో భాగస్వాములు అవుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
దేశంలో రాజకీయాల పరంగా సిద్ధాంతాల పరంగా వేరు అయినప్పటికీ దేశ సమగ్రతను శాంతి సామరస్యాన్ని కాపాడడానికి తామందరం ముందుగా భారతీయులమే అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరం అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ సహాయ సహకారాలు ఈ నియోజకవర్గానికి ఎల్లవేళలా అండగా ఉంటాయని తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజాప్రతినిధులకు స్థానికులకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు