*కవిత కారు దిగింది
*ఆమె వ్యాఖ్యలకు విశ్వసనీయత లేదు
*పదేండ్ల పాలనలో ప్రజలకు తీరని అన్యాయం
*ఒకే పడవలో కేసీఆర్, రేవంత్
*రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది
*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
*కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై బీజేపీ సెటైర్లు
*రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేత, లైసెన్సులు, పింఛన్ అంటూ చురకలు
Ramchander Rao: కవిత కారు దిగిందని, ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు ఎలాంటి విశ్వసనీయత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అమరవీరులకు అన్యాయం జరిగిందని కవిత ఇప్పుడు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని రాంచందర్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అమరవీరులకే కాదు.. ప్రజలందరికీ అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. కవిత (Kavitha) వ్యాఖ్యల్లో అర్థం లేదని, కారు ఇప్పుడు షెడ్‌లో ఉందని చురకలంటించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం లేదని, ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్లపైకి వచ్చి వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. గత ప్రభుత్వం రైతుల చేతులకు బేడీలు వేస్తే.. ఈ సర్కార్ పోలీసుల కాళ్ళు పట్టుకునేలా చేసిందని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. ఐకేపీ కేంద్రాలు లేదా ఇతర కేంద్రాల ద్వారా అయినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని రాంచందర్ రావు ఫైరయ్యారు. ఉద్యోగులకు విరమణ తర్వాత అందే బెనిఫిట్స్ ఏవీ అందడం లేదన్నారు. రెండేండ్లలో పెన్షన్ అందక 22 మంది ఉపాధ్యాయులు మరణించారని రాంచదర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగులకు చెందిన రూ.12 లక్షల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
గన్ కల్చర్ పెరిగిపోయింది
కేసీఆర్, రేవంత్ ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నారని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ గతంలో ఉద్యోగులను మోసం చేసినట్లే.. రేవంత్ కూడా మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 6 డీఏల్లో 5 డీఏలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో గన్ కల్చర్ (Gun Culture) పెరిగిపోయిందని, ఓ మంత్రి ఓఎస్‌డీ గన్‌తో సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్‌ను బెదిరించారని విమర్శలు చేశారు. డీసీపీ, పొలీస్ కానిస్టేబుల్, గోరక్షకులపై ఇటీవల కాల్పులు జరిగాయన్నారు. డీసీపీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అసద్ కేర్ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారని ఫైరయ్యారు. అలాంటిది జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా మారే అవకాశం ఉందని, ప్రజలు ఆలోచించాలని రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపైనా రాంచందర్ రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జంట నగరాల్లో రౌడీ షీటర్లపై కేసులు ఎత్తేస్తుందని, వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్స్లు జారీ చేస్తుందని చురకలంటించారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు కేసులు నమోదు ఉండబోదని, వయస్సు పైబడిన రౌడీ షీటర్లకు రూ.50 వేల పింఛన్ ఇస్తారని సెటైర్లు వేశారు. రౌడీషీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, భూకబ్జాలు, సెటిల్మెంట్లకు ప్రత్యేక లైసెన్సులు జారీ చేస్తారేమో అంటూ రాంచందర్ రావు తనదైన శైలిలో చురకలంటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డమ్మీ ఎవరు అనేది ప్రజలు తేలుస్తారని పేర్కొన్నారు.
Also Read- Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!
నాంది జూబ్లీహిల్స్ నుంచే
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇన్ చార్జీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచదర్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌కు బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి ఓటు వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని, మజ్లిస్‌ను ఆపాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రజల్లోనూ బీజేపీని గెలిపించాలనే ఆలోచన వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే.. దానికి నాంది జూబ్లీహిల్స్ నుంచే పడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి ఏమీలేదని రాంచందర్ రావు విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లో పాదయాత్ర చేస్తామని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల శక్తి కేంద్ర ఇన్ చార్జీల సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, వేముల అశోక్, పార్టీ ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
