Prisons Department: జైళ్ల శాఖలో ఏం జరుగుతోంది?
Prisons Department ( image credit: swetcha reporter)
Telangana News

Prisons Department: జైళ్ల శాఖలో ఏం జరుగుతోంది? ఆ ఇద్దరికే ప్రమోషన్.. మిగతా ఇద్దరికి ఎందుకు అన్యాయం?

Prisons Department: దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుకున్నాడు’ అన్నది సామెత. జైళ్ల శాఖలో ప్రమోషన్లకు సంబంధించిన వ్యవహారాన్ని విశ్లేషిస్తే ఇది అక్షర సత్యం అని స్పష్టమవుతుంది. అన్ని అర్హతలు ఉన్న ముగ్గురు అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని డిపార్ట్​ మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సిఫార్సు చేసినా ఆ ఫైల్ జైళ్ల శాఖ హెడ్​ ఆఫీస్‌లోనే నెలలపాటు పెండింగ్‌లో ఉండిపోయింది. చివరి సమయంలో ఫైల్ సీఎం కార్యాలయానికి చేరుకోవటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై సంతకం చేయడం జరిగినా అప్పటికే డీపీసీ గడువు ముగియడంతో ప్రమోషన్లు దక్కాల్సిన ముగ్గురు అధికారులకు నిరాశే మిగిలింది. కాగా, జైళ్ల శాఖలోని ఉన్నతాధికారులు ఒక వ్యూహం ప్రకారమే ఇదంతా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతేడాది డీపీసీని ఏర్పాటు

నెలల తరబడి ప్రమోషన్ల ఫైల్‌ను పైకి పంపించక పోవడం దీనిని స్పష్టం చేస్తోందని ఆ శాఖకు చెందిన సిబ్బందే అంటున్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరిండింటెంట్లుగా పని చేస్తున్న నలుగురు అధికారులకు సూపరిండింటెంట్లుగా పదోన్నతులు ఇవ్వడానికి గతేడాది డీపీసీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సభ్యులు 2025, మార్చి 26న సమావేశమయ్యారు. ప్రమోషన్ల జాబితాలో ఉన్న జీ. వెంకటేశ్వర్లు, సీహెచ్. దశరథం, డీ. భరత్​, జీ. ప్రమోద్‌లకు సంబంధించిన యాన్యువల్​ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు (ఏసీఆర్​)లు, ఇతర రికార్డులను పరిశీలించిన అనంతరం ఈ నలుగురికి పదోన్నతులు ఇవ్వొచ్చని 2025, ఏప్రిల్ 8న సిఫార్సు కూడా చేసింది. వీరిలో ఉన్న ఒక ఎస్​సీ సామాజిక వర్గానికి చెందిన అధికారికి అన్ని అర్హతలతోపాటు సీనియారిటీ కూడా ఉందని పేర్కొన్నారు.

Also Read: Transport Department: ఖైరతాబాద్‌ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయంలో.. చక్రం తిప్పుతున్న మినిస్టీరియల్ ఉద్యోగులు

ఇద్దరికిచ్చి.. ఇద్దరికి ఆపేశారు

ఇక, జాబితాలో ఉన్న వెంకటేశ్వర్లు జూన్​ నెలలో రిటైర్​ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చి పదవీ విరమణ పొందేలా చూశారు. ఇక, నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరిండింటెంట్ పోస్టు ఖాళీగా ఉండటంతో జాబితాలో ఉన్న దశరథంకు పదోన్నతి ఇచ్చి అక్కడ నియమించారు. మిగతా ఇద్దరి ప్రమోషన్లను మాత్రం పెండింగ్​‌లో పెట్టారు.

ఖాళీలు ఉన్నా

నిజానికి ప్రస్తుతం జైళ్ల శాఖలో ప్రిజనర్స్ అగ్రికల్చర్ కాలనీ, చర్లపల్లి జైలు సూపరిండింటెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ క్రమంలో భరత్, ప్రమోద్‌లకు ప్రమోషన్లు ఇచ్చి ఆ పోస్టుల్లో నియమించాల్సి ఉంది. దీని కోసం ఫైల్​‌ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ సిఫార్సుకు సంబంధించిన ఫైల్​ జైళ్ల శాఖ హెడ్​ ఆఫీస్​ లోనే నెలలతరబడి పెండింగ్​ లో ఉండిపోయింది. 2025, డిసెంబర్​ 30న ఈ సిఫార్సు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి చేరుకున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ తరువాత సీఎంవోకు చేరినట్టు సమాచారం. ఇక, ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫైల్‌పై సంతకం చేశారు. అయితే, అప్పటికే పుణ్యకాలం ముగిసిపోయింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఏర్పాటు చేసిన డీపీసీ గడువు గత సంవత్సరం డిసెంబర్​ 31వ తేదీతో ముగిసిపోయింది. దాంతో సీఎం సంతకం చేసినా డీపీసీ గడువు ముగిసి పోవడంతో ఈ ఇద్దరు అధికారులకు ప్రమోషన్లు దక్కకుండా పోయాయి.

జైళ్ల శాఖలో జోరుగా చర్చ

ఈ వ్యవహారంపై ప్రస్తుతం జైళ్ల శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ శాఖలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు కొందరు కావాలనే పదోన్నతులకు సంబంధించిన సిఫార్సుల ప్రతిపాదనల ఫైల్‌ను పైకి పంపించ లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 2025, ఏప్రిల్ 8వ తేదీని నలుగురు అధికారులు ప్రమోషన్లకు అర్హులని డీపీసీ స్పష్టంగా చెప్పిన విషయాన్ని కొంతమంది అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆ జాబితాలోని ఇద్దరికి పదోన్నతులు ఇచ్చి మిగతా ఇద్దరివి ఎందుకు ఆపాల్సి వచ్చిందని అంటున్నారు. డీపీసీ గడువు 2025, డిసెంబర్ 31న ముగుస్తుందనగా ఒక్క రోజు ముందు ఈ ఇద్దరు అధికారుల పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌ను హోంశాఖకు పంపించడం దీనిని స్పష్టం చేస్తోందని అంటున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నది వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జైళ్ల శాఖలో పని చేస్తున్న కొందరి పట్లపై అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ అస్మదీయులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న హోంశాఖలో జరిగిన ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Also Read: Forest Department: తెలంగాణలో పెరుగుతున్న పులుల సంచారం.. ఆ 14 జిల్లాల్లో అడుగు జాడలు!

Just In

01

Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Telangana Govt: సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ.. ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన పంచాయతీ రాజ్ శాఖ!

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాల్సిందే.. నేతల మాటలకు అధిష్టానం షాక్?

Meenakshi Natarajan: సర్పంచ్ పరిస్థితులు రిపీట్ కావొద్దు.. ముఖ్య నేతలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం!

Prisons Department: జైళ్ల శాఖలో ఏం జరుగుతోంది? ఆ ఇద్దరికే ప్రమోషన్.. మిగతా ఇద్దరికి ఎందుకు అన్యాయం?