BJP (Image source Swetcha)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BJP Flex Dispute: బీజేపీలో ముదిరిన ‘పవర్ వార్’.. ఈటల అడ్డాలో బండి సంజయ్ వర్గం ఏం చేస్తోందంటే?

BJP Flex Dispute: ఈటల గడ్డపై బండి వర్గం ఆధిపత్య ప్రదర్శన!

హుజూరాబాద్ ఫ్లెక్సీల్లోంచి ఈటల ఫొటో మాయం

అధిష్టానం మౌనంపై పార్టీలో కలవరం

మండిపడుతున్న ఈటల రాజేందర్ వర్గీయులు

హుజూరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో లుకలుకలు తగ్గడం లేదు. ఆధిపత్యం కోసం నేతల మధ్య పోరు ఆగడం లేదు. కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ (Etela Rajender) వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు బహిరంగమయ్యాయి. ఈటెల సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో కీలక పరిణామం జరిగింది. బుధవారం జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి ముందు ఫ్లెక్సీల (BJP Flex Dispute) వివాదం నేతల మధ్య విబేధాలను స్పష్టం చేస్తోంది.

Read Also- Annadata Sukhibhava: ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపే డబ్బులు జమ

బుధవారం బూత్ అధ్యక్షుల సమావేశం కోసం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీల నుంచి ఈటల రాజేందర్ ఫొటో లేకపోవడం పార్టీలో కలకలం సృష్టించింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని, ఈటల వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బలహీనపరిచేందుకు, నియోజకవర్గంపై బండి సంజయ్ వర్గం ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వేసిన వ్యూహాత్మక అడుగుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ పరిణామాలు రేపటి(బుధవారం )సమావేశానికి ఈటల రాజేందర్ హాజరుపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఈటల వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరిస్తే, అది రాష్ట్ర బీజేపీలో వర్గ విభేదాలు మరింత పెరగడానికి, సంస్థాగత నిర్మాణానికి పెద్ద దెబ్బ తగలడానికి దారి తీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆధిపత్య పోరే ప్రధాన అజెండా

హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా పార్టీకి బలం చేకూర్చిన ఈటెలకు చెక్ పెట్టడమే ఈ సమావేశం వెనుక ఉన్న ఏకైక కారణమని తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న బండి సంజయ్, తన పరిధిలో ఉన్న హుజూరాబాద్‌పై తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ఈటెల నాయకత్వాన్ని కాదని, నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంబంధాలు నెరపడం ద్వారా ఈటెల వర్గాన్ని నిర్వీర్యం చేయాలనేది బండి వర్గం వ్యూహంగా ఉంది. నియోజకవర్గ స్థాయిలో టికెట్లు, పదవులపై పట్టు సాధించేందుకే ఇరు వర్గాలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నాయి. ఈ పోరు కారణంగా పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతుండడంపై బీజేపీ అంతర్గత వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also- Immadhi Ravi arrest: నేరాన్ని అంగీకరించిన ఐ బొమ్మ రవి.. అమీర్‌పేట డొమైన్ వల్లే దొరికాడా!

అధిష్టానం మౌనం

ఎన్నికల ముంగిట రాష్ట్రంలోని కీలక నేతల మధ్య ఇలాంటి వర్గ విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కడం పార్టీకి మంచిది కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి, ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ పెద్ద సవాలుగా మారింది. ఈ ఆధిపత్య పోరుపై బీజేపీ కేంద్ర అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన గానీ, జోక్యాన్ని గానీ ప్రకటించలేదు. ఈ మౌనం ఇద్దరు నేతల మధ్య దూరాన్ని మరింత పెంచుతుందని, తద్వారా సంస్థాగత నిర్మాణానికి తీవ్ర నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్‌లో రాజుకున్న ఈ వివాదాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో అనే దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంతకాలంగా ఈ వివాదంపై అధిష్ఠానం స్పందించకపోవడంపై బీజేపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Ginning Millers Strike: పత్తిరైతులకు గుడ్‌న్యూస్.. జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల చర్చలు సఫలం

Andhra King Taluka Trailer: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

Shamsabad tragedy: గర్భవతి మృతి.. జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య.. తీవ్ర విషాద ఘటన

BJP Flex Dispute: బీజేపీలో ముదిరిన ‘పవర్ వార్’.. ఈటల అడ్డాలో బండి సంజయ్ వర్గం ఏం చేస్తోందంటే?

SI Bribery Case: గోడ దూకి పరారైన ఎస్ఐ, వెంబడించి పట్టుకున్న ఏసీబీ.. ఇంతకీ ఏం చేశాడంటే?