Immadhi Ravi arrest: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌లు iBomma, Bappam TV వెనుక ఉన్న సూత్రధారి, ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. దేశ డిజిటల్ భద్రతకు ఒక ముఖ్యమైన విజయం. సాంకేతిక ఆధారాల ద్వారా రవిని గుర్తించిన పోలీసులు, పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల విచారణలో రవి తన నేరాన్ని అంగీకరించడమే కాకుండా, తన పైరసీ నెట్‌వర్క్‌ను ఏ విధంగా నడిపాడో కూడా వివరించాడు.
Read also-Hema mother death: టాలీవుడ్ ప్రముఖ నటి హేమ తల్లి మృతి.. సంతాపం తెలిపిన ‘మా’ సభ్యులు..
నెట్‌వర్క్ విస్తరణ ఇలా..
రవి iBomma, Bappam పేర్లతో కలిపి మొత్తం 17 వెబ్‌సైట్‌లను సృష్టించినట్లు గుర్తించారు. వీటిలో IBOmMA.foo, ibomma.nexas, ibomma.market, ibomma.one వంటి డొమైన్‌లు iBomma పేరుతో, bappam.tv, bappam.cc, bappam.co.in, bappam.net, bappam.org, bappam.eu వంటివి Bappam పేరుతో నడిపాడు. పోలీసులు మొత్తం 110 డొమైన్‌లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. iBomma వెబ్‌సైట్‌కు వచ్చే ట్రాఫిక్‌ను బెట్టింగ్ సైట్‌లకు మళ్లించడం ద్వారా రవి భారీగా ఆదాయం సంపాదించాడు. Traders in.com, makeindiashop.shop అనే రెండు డొమైన్‌లను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ ట్రాఫిక్ డొమైన్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు డొమైన్‌లే రవిని పట్టించాయి. ఒక డొమైన్‌ను అమెరికాలో, మరొక డొమైన్‌ను అమీర్‌పేటలో రిజిస్టర్ చేయించాడు.
ఆర్ధిక లావాదేవీలు ఎలా అంటే..
రవి తన అక్రమ ఆదాయాన్ని క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుండి తన ICICI NRE ఖాతాకు నిధులను బదిలీ చేసుకున్నాడు. మొత్తం 20 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను గుర్తించిన పోలీసులు, అందులో 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో 3 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు తేలింది. రవి, భారతదేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. విదేశీ పౌరసత్వం తీసుకోవడం అతని క్రిమినల్ ఇంటెన్షన్‌ను స్పష్టం చేస్తుందని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.
Read also-Human Sagar death: ప్రముఖ ఒడియా గాయకుడు కన్నుమూత.. రాజకీయ ప్రముఖులు సంతాపం
డిజిటల్ భద్రతకు ముప్పు
iBomma నెట్‌వర్క్ దాదాపు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల వ్యక్తిగత డేటాను కూడా సేకరించింది. ఈ డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. పైరసీ వెబ్‌సైట్‌లు కేవలం సినిమాలకు మాత్రమే కాదు, ప్రజల వ్యక్తిగత డేటాకు, ఆర్థిక భద్రతకు కూడా ప్రమాదమని పోలీసులు తెలిపారు. రవి లాంటి వ్యక్తులు దేశ డిజిటల్ భద్రతకు హానికరం అని, అతడిని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వెబ్‌సైట్‌లు మళ్లీ మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఈ అరెస్ట్‌తో iBomma వెబ్‌సైట్ సేవలను భారతదేశంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు సందేశాన్ని పోస్ట్ చేసింది. ఈ విజయం చలన చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరట.
