Secunderabad Bonalu 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) జిల్లా అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ జాతర బోనాల (Ashada Fair Bonala) ఏర్పాట్ల సమీక్షను జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, (MLA Srinivas Yadav) ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ.. చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి (Ashada Fair Bonala) ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఉజ్జయిని మహంకాళి దేవస్థానం (Secunderabad సికింద్రాబాద్‌లో జూలై 13న అమ్మవారికి బోనాలు సమర్పణ, జూలై 14న రంగం (భవిష్యవాణి), అమ్మవారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివస్తారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 13వ తేదీన దేవాలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం సులభతరం చేయాలని దేవాలయ, పోలీస్ అధికారులను ఆదేశించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులంతా సేవాభావంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
Also Read: Indiramma Houses: లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్.. మంత్రి వెల్లడి!
సమన్వయంతో పనిచేయాలి..
రెవెన్యూ, దేవాదాయ, పోలీస్, (Police) జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, ముఖ్యంగా 14వ తేదీన అంబారీ ఊరేగింపులో భక్తులు, ప్రజలకు తొక్కిసలాటలు వంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ (Police) అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్ దర్వాజా బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బోనాలు నిర్వహించే దేవాలయాల్లో ఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి సూచించారు. రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి తెలంగాణ బోనాల ఉత్సవాలకు భక్తులు తరలివస్తారని, వారికెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, వాహనాల పార్కింగ్, వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్ ఏర్పాట్లు, నిరంతరం నీటి నిల్వల పరిశీలన, పారిశుద్ధ్య పనులు, మొబైల్ టాయిలెట్స్, సీసీ కెమెరాల నిర్వహణ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.
తెలంగాణకు ప్రత్యేకం..
స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ (MLA Srinivas Yadav) మాట్లాడుతూ.. ఉజ్జయిని మహంకాళి బోనాలు తెలంగాణకు ప్రత్యేకమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా పనిచేయాలని కోరారు. అమ్మవారికి బోనాలు సమర్పణ, ఊరేగింపులో భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ శాఖ, రోడ్డు భవనాలు శాఖ, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, జీహెచ్‌ఎంసీ, (GHMC) హెచ్‌ఎండీఏ, (Police) పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖలతో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఎస్. కామేశ్వర్, ఆదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ రామకృష్ణా రావు, టెంపుల్ ఈఓ మనోహర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఎస్‌ఈ విద్యుత్ శాఖ చక్రపాణి, ఈఈ ఆర్ అండ్ బీ మనోహర్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, జీహెచ్‌ఎంసీ, (GHMC) హెచ్‌ఎండీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: Corruption Cases: ఆరు నెలల్లోనే.. 122 కేసులు రిజిస్టర్!