Corruption Cases: అవినీతి నిరోధక శాఖ దడ పుట్టిస్తున్నది. పక్కాగా సమాచారాన్ని సేకరిస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారుల భరతం పడుతున్నది. వరుసగా కేసులు నమోదు చేస్తున్నది. గతేడాది మొత్తంలో 129 కేసులు నమోదు కాగా, గడిచిన ఆరు నెలల్లోనే 122 కేసులు రిజిస్టర్ చేసిన ఏసీబీ అధికారులు అవినీతి అనకొండలను సైతం జైలుకు పంపించారు. ఇందులో (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పని చేసిన ఈఎన్సీ హరీరాం, ఈఈ నూనె శ్రీధర్ (Sridhar) తదితరులు ఉండటం గమనార్హం. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ (Vijay Kumar) బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతికి పాల్పడుతున్న అధికారుల ఆట కట్టించేందుకు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అధికారికంగా సహాయ పడేందుకు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు.
Also Read:Phone Tapping Case: ప్రభాకర్ రావు ఎవరి కనుసన్నల్లో పనిచేసినట్టు!
మనీషా రూ.15వేలు లంచం
దాంతోపాటు 9440446106 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియ చేయవచ్చన్నారు. ఈ మేరకు వేర్వేరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెంబర్లతో సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయించారు. దీనికి విశేషమైన స్పందన వస్తున్నది. పనిచేసి పెట్టటానికి ఏ అధికారి డబ్బు డిమాండ్ చేసినా బాధితులు (ACB) ఏసీబీకి సమాచారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేసి అవినీతికి పాల్పడుతున్న అధికారులను పట్టుకుంటున్నారు. దీనికి నిదర్శనంగా అంబర్‌పేట జీహెచ్ఎంసీ (GHMC) ఆఫీస్‌లో ఏఈగా పని చేస్తున్న మనీషా రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ముందస్తు సమాచారం మేరకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఉదంతాన్ని పేర్కొనవచ్చు.
బడా అధికారులను సైతం
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న వారి ఆట కూడా ఏసీబీ అధికారులు కట్టిస్తున్నారు. పక్కగా సమాచారాన్ని సేకరించి ఆకస్మిక దాడులు జరుపుతూ కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీగా పని చేసిన భూక్యా హరీరాం ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు హరీరాం అతని సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిపారు.
అక్రమంగా రూ.200 కోట్లు
తనిఖీల్లో షేక్‌పేట, కొండాపూర్‌లో ఆయనకు విల్లాలు ఉన్నట్టు గుర్తించారు. దాంతోపాటు శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలలో ఫ్లాట్లు, అమరావతిలో కమర్షియల్ స్థలం, మహబూబ్‌నగర్ జిల్లాలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, బొమ్మల రామారంలో మామిడితోట తదితర ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ ఆస్తుల విలువ ప్రైవేట్ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య పాత్ర వహించిన ఈఈ నూనె శ్రీధర్ Sridhar) ఇంటితోపాటు మరికొన్ని చోట్ల దాడులు జరిపి ఆయన అక్రమంగా రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏ ప్రభుత్వ అధికారి అయినా అధికారికంగా సాయ పడేందుకు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read: Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!