Panchayat Elections: గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ప్రజల ఆమోదముద్ర పడే సమయం ఆసన్నమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపిక ప్రక్రియ నేడు పోలింగ్‌తో పూర్తి కానుంది. సర్పంచ్, వార్డు సభ్యుని స్థానాల కోసం పలువురు అభ్యర్థులు పోటీలో ఉండగా, ప్రజలు ఎవరికి విజయం అందిస్తారన్నది మరికొన్ని గంటల్లో స్పష్టం కానుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందితోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి.
147 గ్రామ పంచాయతీలకు నేడు పోలింగ్
మొదటి విడుతలో భాగంగా గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 147 గ్రామ పంచాయతీలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ ప్రక్రియలో 147 సర్పంచ్, 1208 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి విడుత పోలింగ్ నిర్వహణ కోసం మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దౌల్తాబాద్ మండలం తెలంగాణ మోడల్ స్కూల్‌లో, గజ్వేల్ అర్బన్ మండలం ఐఓసీ గజ్వేల్‌లో, మర్కూక్ మండలం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల మర్కుక్‌లో, ములుగు మండలం రైతు వేదిక ములుగులో, రాయపోల్ మండలం జీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో, వర్గల్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల వర్గల్‌లో, జగదేవ్ పూర్ మండలం ఎస్‌వీ ఫంక్షన్ హాల్ జగదేపూర్‌లలో ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుండే పోలింగ్ సామగ్రితో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు.
Also Read: Panchayat Elections: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ చొరవ.. ఆ 37 పంచాయతీల ఏకగ్రీవం రికార్డ్!
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం: కలెక్టర్
ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిర్వహణ సిబ్బందికి సూచనలు చేశారు. ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించి, ఆ తర్వాతనే ఓటింగ్‌కు ప్రజలకు అనుమతి ఇవ్వాలన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓట్లు వేయడానికి అనుమతించాలని, అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్‌లో ఉన్న వారికి ఆ తర్వాత కూడా ఓటింగ్ సమయం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లకు మరియు పోలింగ్ సిబ్బందికి ఫోన్ అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, ఆయా మండలాల తాసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Panchayat Elections: నేడు పంచాయతీ తొలి విడుత పోలింగ్.. కట్టుదిట్టమైన భద్రత

