Panchayat Elections: పల్లె సీమల్లో గ్రామ స్వరాజ్యం దిశగా జరిగే ‘పల్లె పోరు’కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం తొలి విడుత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రశాంతమైన, సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా పటిష్టమైన భద్రత, నిర్వహణ చర్యలు చేపట్టారు. బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో తొలి విడుత పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవం
తొలి విడుతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం పలు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటివరకు 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఆ స్థానాలు మినహాయించగా మిగిలిన 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు పోలింగ్ జరగనుంది. 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 27,628 వార్డులకు గాను 65,455 మంది పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) వినియోగించడం లేదు. సాంప్రదాయ బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
369 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డులు ఏకగ్రీవం
ఈ తొలి దశ పోలింగ్‌లో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,41,070 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 28,78,159 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగే 5 గ్రామ పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అలాగే 169 వార్డుల్లోనూ ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఒక గ్రామపంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. అలాగే పది వార్డు స్థానాలకు సైతం నిలిచిపోయినట్లు అధికారులు స్పష్టంచేశారు. కాగా 369 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
Also Read: Panchayat Elections: వినూత్న ఎన్నికల హామీ పత్రంతో భార్గవి.. ఓటర్ల దృష్టిని ఆకర్షించిన అభ్యర్థి!
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, అక్కడ అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో బందోబస్తును రెండింతలు పెంచారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ వంటి జిల్లాల్లో అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలను, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మాజీ మావోయిస్టులు పోటీ చేస్తున్న శివంగలపల్లి వంటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 3,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాగా ఎన్నికలకు ఎవరైనా విఘాతం కలిగించే అవకాశముందని భావించి భారత న్యాయ సంహిత ప్రకారం 31,428 మందిని బైండోవర్ చేసినట్లు స్పష్టంచేశారు. 902 లైసెన్స్ డ్ ఆయుధాలను పోలీసుల వద్ద డిపాజిట్ చేశారు. దాదాపు రూ.1,70,58,340 నగదును సీజ్ చేశారు. రూ.2,84,97,631 విలువైన మద్యం సీజ్ చేశారు. అలాగే రూ.2,22,91,714 విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. తనిఖీల్లో భాగంగా రశీదులు చూపని రూ.12,15,500 విలువైన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీఎంపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు : రాణి కుముదిని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణి కుముదిని తెలిపారు. కాగా దీనిని ఎన్నికల ప్రవర్తన నియమావళికి పంపినట్లు తెలిపారు. వారందించే నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఆమె స్పష్టంచేశారు. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల నిర్వహణకు తమను అనుమతి అడిగారని, తాము కూడా అనుమతి ఇచ్చినట్లు ఆమె చెప్పారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌటింగ్ ప్రారంభమవుతుందని వివరించారు. కాగా ఉప సర్పంచ్ ఎన్నిక గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని ఆమె చెప్పారు. సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని రాణి కుముదిన స్పష్టంచేశారు.
ఫస్ట్ ఫేజ్ ఎన్నికల వివరాలు
మొత్తం మండలాలు నోటిఫై 189
గ్రామ పంచాయతీలు నోటిఫై 4236
వార్డులు నోటిఫై 37,440
పోలింగ్ స్టేషన్లు 37,562
ఫేజ్ 1 ఓటర్ల సంఖ్య 56,19,430
పురుషులు 27,41,070
మహిళలు 28,78,159
ఇతరులు 201
నామినేషన్ దాఖలు చేయని జీపీలు 5
నామినేషన్ దాఖలవ్వని వార్డులు 169
ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు 396
ఏకగ్రీవమైన వార్డు స్థానాలు 9,633
ఎన్నిక నిలిచిపోయిన జీపీ 1
ఎన్నిక నిలిచిపోయిన వార్డులు 10
పోలింగ్‌కు వెళ్లే జీపీలు 3,834
పోలింగ్‌కు వెళ్లే వార్డులు 27,628
సర్పంచ్ అభ్యర్థులు 12,960
వార్డ్ మెంబర్ అభ్యర్థులు 65,455
రిటర్నింగ్ ఆఫీసర్లు 3,591
పోలింగ్ సిబ్బంది 93,905
మైక్రో ఆబ్జర్వర్లు 2,489(మూడు దశలకు కలిపి)
వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు 3,461
వినియోగించనున్న బ్యాలెట్ బాక్సులు 45,086
థర్డ్ ఫేజ్ లో 4157 జీపీలకు 12,246 మంది అభ్యర్థులు బరిలో
మూడో విడుత పోలింగ్ పై అధికారులు క్లారిటీ ఇచ్చారు. మొత్తం 4157 గ్రామపంచాయతీలను నోటిఫై చేయగా.. ఇందులో 11 జీపీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలదు. 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 3752 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో 12,246 మంది అభ్యర్థులు ఉన్నారు. 4157 జీపీల్లతో 36,434 వార్డులను అధికారులు గుర్తించారు. ఇందులో 112 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలవ్వకపోవడం గమనార్హం. మొత్తం వార్డుల్లో 7916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా 28,406 వార్డులకు పోలింగ్ జరగనుంది. 67,367 మంది తలపడనున్నారు.
Also Read: Panchayat Elections: పల్లెల్లో మూగబోయిన మైకులు.. ముగిసిన తొలి విడత ప్రచారం

