Kavitha vs KTR: కవిత వర్సెస్ కేటీఆర్‌గా రాజకీయం మారబోతుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆ తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గులాబీ పార్టీ, నేతలపై విమర్శలకు పదును పెట్టారు. గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నా పార్టీ అగ్రనేతలు ఎవరు స్పందించలేదు. కేవలం కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలు.. అదికూడా వారిపై ఆరోపణలు చేస్తే కౌంటర్ ఇచ్చారు. కవిత ప్రధానంగా హరీశ్ రావు, సంతోష్ లతో పాటు కేటీఆర్ పైనా, పార్టీపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. కనీసం ఆమెను పరిగణలోకి తీసుకోవడం లేదన్నట్లు వ్యవహరించారు. కవిత వ్యాఖ్యలు లైట్ అన్నట్లు ఇన్నాళ్లు వ్యవహరించారు. అయితే, కవిత విమర్శలు, ఆరోపణలతో పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించారో ఏమో తెలియదు కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
మేం అందరినీ కలుస్తున్నాం..
కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత మీడియా చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్‌కు క్యాడర్ గుర్తుకు వచ్చిందని, గతంలో ఎవర్నీ కలువ లేదని, ప్రస్తుతం సర్పంచ్‌లను కూడా కలుస్తున్నారని కవిత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ సైతం తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. భవన్‌లో కేటీఆర్ సైతం మీడియా చిట్‌చాట్‌లో సర్పంచులను, నేతలను కలవడం కొత్తేమీ కాదని, తెలంగాణ భవన్‌కు వచ్చిన అందరినీ గతంలో కలిశాం, ఇప్పుడూ కలుస్తామని పేర్కొన్నారు. కావాలని ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీశారని కవిత వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో బీఆర్ఎస్ అణిచివేసిందని ఆరోపించారు. కానీ, ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని కేటీఆర్ అడగటం విచిత్రంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగడం సాధ్యం కాదని, కానీ, ఎప్పుడు పునర్విభజన జరిగిన సరే సికింద్రాబాద్‌ను జిల్లా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అదే విధంగా పీపీ నర్సింహారావు పేరును ఏదైనా ఒక జిల్లాకు పెట్టాలని కోరారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ సైతం సమాధానం చెప్పారు. తామెప్పుడూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించలేదన్నారు. లేని ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి జంట నగరాల అస్తిత్వం దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలని కేటీఆర్ సూచించారు. సికింద్రాబాద్‌లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Ustaad BhagatSingh: పవన్ కోసం తన కలానికి మరింత పదును పెడుతున్న చంద్రబోస్.. ఇది వేరే లెవెల్..
కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం!
త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో కవిత వ్యాఖ్యలు గులాబీ పార్టీకి నష్టం చేకూరుస్తాయనే భావనతో కేటీఆర్ స్పందించారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. పురపాలక ఎన్నికలను గులాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. నేతలు, క్యాడర్ సైతం పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి అంశాన్ని కవిత ప్రస్తావించడం బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేయలేదన్నట్లు చేస్తున్న వ్యాఖ్యలు, తప్పిదాలను ఎత్తి చూపుతుండటంతో దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. పార్టీలోనే కొంతమంది నేతలు మాత్రం కవిత వ్యాఖ్యలకు స్పందించకుండా ఉండాలని సూచిస్తుండగా కొందరు మాత్రం కౌంటర్ ఇస్తేనే మరోసారి విమర్శలు చేయడానికి ఆలోచిస్తారని పేర్కొంటున్నారు. ఏది ఏమైన కవిత చేస్తున్న వ్యాఖ్యలు సైతం పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో మాత్రం విస్తృత చర్చజరుగుతుంది.
Also Read: Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు

