Sangareddy District: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చెల్లెలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిపై నలుగురు సోదరులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చితకబాదారు. ముఖం, కాళ్లు, చేతులపై తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో యువకుడు స్పృహ తప్పడంతో చనిపోయాడని భావించి.. సోదరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్పృహలోకి వచ్చిన యువకుడు జరిగినదంతా చెప్పడంతో.. ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా కంది మండలం బ్యాథోల్ గ్రామానికి చెందిన ఓ యువతిని దేవ్ సింగ్ ప్రేమించాడు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ యువతికి నలుగురు సోదరులు ఉండగా.. వారికి చెల్లి ప్రేమ వ్యవహారం అస్సలు నచ్చలేదు. పద్దతి మార్చుకోవాలని.. పలుమార్లు దేవ్ సింగ్ ను హెచ్చరించారు. అయినా వినకపోవడంతో ఎలాగైన అతడి అడ్డు తొలగించుకోవాలని ప్రణాళికలు రచించారు.
ట్రాప్ చేసి.. కారులో తీసుకెళ్లి..
దేవ్ సింగ్ కు కాల్ చేసిన యువతి సోదరులు అతడ్ని ట్రాప్ చేశారు. యువతి కోసం నర్సాపూర్ బస్టాండ్ వద్దకు వచ్చిన దేవ్ సింగ్ ను కారులో ఎక్కించుకొని.. నర్సాపూర్ – తూప్రాన్ ప్రాంతాల మధ్య చాకరిమెట్ల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ దేవ్ సింగ్.. చలనం లేకుండా పడి ఉండటంతో చనిపోయాడని భావించి.. నలుగురు సోదరులు అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు.
Also Read: IND vs NZ 1st T20I: భారత్ vs కివీస్.. కొద్ది గంటల్లో తొలి టీ-20 మ్యాచ్.. ఎవరు గెలుస్తారు?
రంగంలోకి పోలీసులు..
కొద్దిసేపటి తర్వాత తిరిగి స్పృహలోకి వచ్చిన దేవ్ సింగ్.. నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అతడ్ని స్థానికులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు విషయం చేరవేయడంతో వారు హుటాహుటీనా జీడిమెట్లలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవ్ సింగ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

