BRS Strategy: కేసుల్లో విచారణకు పిలిస్తే తెలంగాణ భవన్‌లో హంగామా
నేతలు, కేడర్‌తో భేటీ
నాడు ఫార్మూలా ఈ-కారు రేసులో కేటీఆర్ విచారణ సమయంలోనూ ఇంతే
కాళేశ్వరం విచారణ సమయంలో కేసీఆర్
తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సిట్ విచారణ
హంగామా చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ అటెన్షన్ రాజకీయాలంటూనే గులాబీ సైతం అదే దారిలో
ప్రజల్లో హాట్ టాపిక్ అయిన గులాబీ తీరు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అధికార, విపక్షాల మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎవరి మార్గాలు వారు అన్వేషిస్తున్నారా?… ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా?… ఇంతకీ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు?… విచారణకు వెళ్లే ముందు బలపదర్శన దేనికి సంకేతం? అనేది ఇప్పుడు హాట్‌గా (BRS Strategy) మారింది.
గులాబీ పార్టీ అధికార కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ప్రధాన ప్రతిపక్షం పై బురద జల్లుతుందని.. కేసుల పేరుతో వేధిస్తుందని.. అందులో భాగంగానే ఫోన్ టాపింగ్ కేసు తీసుకొచ్చి హరీష్ రావుపై విచారణ చేస్తుందని అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ చేయగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు హరీష్ రావును ఘోష కమిటీ విచారణ చేపట్టింది. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వస్తున్న సమయంలో అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని ప్రభుత్వం పై గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే కమిషన్లు, విచారణల పేరిట వేధిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం గులాబీపార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయాలని గొంతెత్తూ విమర్శల స్పీడ్ పెంచింది. అంతేకాదు ప్రతి సందర్భంలో ను అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read Also- Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఒక వైపు కాంగ్రెస్ వి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలంటూనే గులాబీ పార్టీ అదే ధోరణి అనుసరిస్తుందనే చర్చ జరుగుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లిన సమయంలోను తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బలనిరూపణ చేశారు. అక్కడి నుంచి ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లారు.. ఆయన వెంట ఏసీబీ కార్యాలయం వరకు నేతలు, కార్యకర్తలు వెళ్లారు. విచారణ అనంతరం మళ్లీ భవన్ కు వచ్చి మీడియా ముందు హడావుడి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఫిల్లర్లు కుంగుబాటుపై ప్రభుత్వం వేసిన ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేతకేసీఆర్ ను విచారణకు పిలిచిన సమయంలోనూ ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్ బీఆర్కే భవన్ కు నేతలు ర్యాలీగా వచ్చారు. బీఆర్కే భవన్ వద్ద పార్టీ కీలకనేతలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. అదే కేసులో హరీష్ రావు విచారణ సందర్భంలోనూ నేతలు భారీగా తరలిచ్చారు.
తాజాగా ఫోన్ టాపింగ్ కేసులో ను హరీష్ రావును సిట్ విచారణకు సోమవారం పిలువగా ఆయన సైతం భవనకు వచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నేతలు భారీగా తరలిరావాలని ఒక రోజూ ముందే పిలుపు నివ్వడంతో భారీగా తరలివచ్చారు. బల ప్రదర్శన చేశారనే చర్చ జరుగుతుంది. ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు సిట్ విచారణ అనే అంశం పక్కదారి పట్టేలా … చర్చకు రాకుండా పక్కా వ్యూహంతోనే నేతలతో భేటీ అయ్యారని అధికార కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. కేటీఆర్ సైతం భవనకు వచ్చి హరీష్ రావు కు మద్దతు పలికారు. తామంతా మీవెంటె ఉన్నామని భరోసా కల్పించారు. పార్టీకి చెందిన కార్యకర్త అయినా నాయకుడు అయినా పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికే భవన్ కు నేతలంతా తరలివచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలని స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also- TPCC Chief: తప్పు చేశారు కాబట్టే.. లొట్ట పిసు కేసులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ సెట్ విచారణ ప్రభావం పడకుండా గులాబీ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది స్పష్టమవుతుంది. గులాబీ పార్టీ పైకి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు కేసులు వెంటాడుతున్నాయనే భయం నేతల్లో ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరిపై ప్రభుత్వం కేసులు పెడుతుందో.. పాత కేసులు తెరమీదకు తెచ్చి ఇబ్బందులకు గురిచేస్తుందోనని పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే బిఆర్ఎస్ కార్యకర్తలను, నేతలను కాపాడుకోవడానికి బల ప్రదర్శన చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. విచారణ సంస్థలు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తే నేరుగా విచారణకు హాజరవ్వాలి కానీ ఇలాంటి బల ప్రదర్శనతో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అధికార కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ చేసేవన్నీ అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలను పేర్కొంటూనే గులాబీ పార్టీ సైతం అదే అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు తెరదీయడం ఇప్పుడు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది.

