Harish Rao Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Taping Case) మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు (Harish Rao Investigation) సిట్ విచారణ ఎట్టకేలకు ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు ఏకంగా 8 గంటలకుపైగా ప్రశ్నించారు. సుధీర్ఘ సమయం పాటు సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. కాగా, విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటీస్ అంతా ఒక ట్రాష్ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ‘‘నిజంగా చెప్పాలంటే ఉత్త సొల్లు. నిరాధారమైన ఆరోపణలు. ఆధారంలేని మాటలు. అడిగిందే అడుగుడు. సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఒక గంట అడుగుడు. పైనుంచి ఫోన్లు వస్తాయి. బయటకు పోవడం. గంట మాట్లాడుకొని మళ్లీ రావడం. మళ్లో అర్ధగంటో, గంటో అడగంగనే.. ఫోన్ ఫోన్ అంటూ సైగలు వస్తాయి, మళ్లీ బయటకు పోవడం. ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తున్నారా?, సీపీ సజ్జనార్ చేస్తున్నారా? నాకు తెలియదు. ముగ్గురు అధికారులు ప్రశ్నించారు. ముగ్గురూ బయటకు వెళ్లడం, గంట మాట్లాడుకొని వచ్చి మళ్లీ అడగటం. అడిగిందే అడగడం తప్ప అందులో ఏమీ లేదు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసమే’’ అని హరీష్ అన్నారు.
Read Also- Harish Rao Interrogation: ఉదయం నుంచి ఇంకా సిట్ విచారణలోనే హరీష్ రావు.. బీఆర్ఎస్‌లో ఆందోళన!
సైట్ విజిట్ నిబంధన పేరిట బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన విషయాన్ని బట్టబయలు చేశామని, సైట్ విజిట్ నిబంధన తీసుకురావడంతో మొదటి లబ్దిదారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదని ఆరోపించారు. ఉదయం తాను బయటపెడితే, సాయంత్రానికి నోటీసులు పంపించారని ఆరోపణలు గుప్పించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాత్రమే తాము అన్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ‘‘రేవంత్ రెడ్డి నువ్వు నిజాయితీ పరుడవి అయితే, తప్పు చేయకపోతే, తక్షణమే సుప్రీంకోర్టో, హైకోర్టో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు’’ అని డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నామని చెప్పారు.

