Women Empowerment: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం జోగిపేట పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అందోల్–జోగిపేట మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ, పట్టణ స్థాయిలో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.
అందోల్ – జోగిపేట మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాలకు మొత్తం రూ.74.26 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి దామోదర రాజనర్సింహ పంపిణీ చేసారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల్లో ముందడుగు వేయాలని సూచించారు. పేద మహిళలకు గౌరవం, భరోసా కల్పించడమే ఇందిరమ్మ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తున్నాయని, భవిష్యత్తులో కూడా మహిళల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
Also Read: TPCC Chief: తప్పు చేశారు కాబట్టే.. లొట్ట పిసు కేసులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
ఆందోల్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాట్లు అయితే స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలనే ఉద్దేశంతో ఆందోల్ లో ఐదు ఎకరాల భూమిని ప్లాటుగా విభజించి పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. అలాగే మహిళలకు నాణ్యతతో కూడిన చీరల ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ తోపా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

