TPCC Chief: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్షపడాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సిట్ విచారణపై హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమని వ్యాఖ్యానించారు. తప్పు చేశారు కాబట్టే మాజీమంత్రి కేటీఆర్ లొట్టపీసు కేసు అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు.ప్రతిపక్ష నేతలను రాజకీయ వేధింపులకు పాల్పడే ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డికి లేదని మహేశ్ కుమార్ స్పష్టం చేశారు.. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం కేటీఆర్ ప్రెస్ మీట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాముల గురించి చెప్తున్న కేటీఆరే స్కాముల్లో ఇరుక్కొని ఉన్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను నిర్దోషినని హరీశ్ రావు నిరూపించుకోవాలన్నారు. సిట్ నోటీసు ఇస్తేనే అరెస్టు చేసినట్లు ఫీలవుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ అస్థిత్వం అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. మీ పార్టీ పేరు నుంచి తెలంగాణ పదం తీసినప్పుడే మీరు అస్థిత్వాన్ని కోల్పోయారని అద్దంకి దయాకర్ అన్నారు. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి మీపై కక్షగట్టి ఉంటే.. విచారణతో పేరుతో కాలయాపన చేయకుండా నేరుగా జైల్లో పెట్టేవారు కదా అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Illegal Constructions: ఎల్లంపేటలో ఆక్రమ నిర్మాణాలు.. అధికారుల తీరు ఎలా ఉందంటే?
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు జరుగుతున్నాయంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలను మరో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీరు కడిగిన ముత్యం కాదని, రాక్షసులని కవితే చెబుతున్నారని బల్మూర్ వెంకట్ గుర్తుచేశారు. అధికారులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ ను హెచ్చరించారు. గతంలో తనపై అత్యధిక కేసులు పెట్టి.. ఇబ్బందులకు గురి చేశారని బల్మూర్ వెంకట్ గుర్తుచేశారు.

