Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి నెలకుంది. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికల సంబరానికి ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపింది. జిల్లాలో 464 గ్రామపంచాయతీలు, 214 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పిటిసి స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు గత రెండేళ్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి నాయకులు ఎదురుచూస్తూ వస్తున్నారు . రెండేళ్ల నుంచి ఇప్పుడు, అప్పుడు అంటూ వస్తున్న ఊహాగానాలకు ఎన్నికల సంఘం పుల్ స్టాప్ పెట్టింది. స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయించడంతో అయా పార్టీలో ఆశావహ నాయకులు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు పైరవీలు చేస్తున్నారు.
రిజర్వేషన్లతో తగ్గిన జనరల్ స్థానాలు
కాగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఈసారి స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. ఫలితంగా జనరల్ స్థానాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో బీసీలదే ప్రధాన భూమిక కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. దీనివల్ల బీఆర్ఎస్, బీజేపి పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు జెడ్పి పీఠంపై కన్నేయగా ఈ రిజర్వేషన్లు వారి ఆశలను అడియాశలు చేశాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల, గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లాబీయింగ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ వైపు మెుగ్గు
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ కలిగి ఉండడంతో ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. కోడ్ ప్రకారం రాజకీయ పార్టీల బ్యానర్లు, ప్రచార పోస్టర్లు తొలగించాలని ఆదేశించారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు పాల్గొనకూడదని, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా పార్టీల రాజకీయ కార్యక్రమాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ రెండో వారంలో ఫలితాలు వచ్చేవరకు గ్రామాల్లో దసరా పండుగతో పాటు ఎన్నికల సందడి నెలకొన్నది.
జిల్లాలో పరిషత్ ఎన్నికలు ఇలా…
జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరిస్తూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలలో జరుగుతాయని వివరించారు. మొదటి విడతలో 109 ఎంపీటీసీ స్థానాలు, 9 జడ్పీటీసీ స్థానాలకు, బిజినపల్లి, నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూర్ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండో విడతలో 105 ఎంపీటీసీ స్థానాలు, 11 జడ్పీటీసీ స్థానాలకు అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also Read: Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!
గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇలా
పంచాయతీ మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బిజినపల్లి, నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో 151 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో 158 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడతలో కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూర్, తాడూర్, తెలకపల్లి మండలాల్లో 151 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది.