Pocham Srinivas Reddy: నాది స్వార్థపూరిత నిర్ణయమైతే చెప్పుతో కొట్టండి
నియోజకవర్గ అభివృద్ది కోసం రేవంత్‌తో కలిశా
నా నిర్ణయం తప్పైతే చెప్పండి తప్పుకుంటా
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారంటూ తనపై వస్తున్న విమర్శల పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocham Srinivas Reddy) గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా రాజకీయ జీవితంలో ఎలాంటి దుర్మార్గపు పనులకు పాల్పడలేదు. ప్రజల కోసమే పనిచేశాను. కొందరు పనిగట్టుకొని నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ నేను నా స్వార్థం కోసం ఏదైనా నిర్ణయం తీసుకొనివుంటే చెప్పుతో కొట్టాలి’’ అని ఆయన అన్నారు. బాన్సువాడలో గురువారం నాడు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొందరు ప్రత్యర్థులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదో ఆశించి, స్వార్థం కోసం రేవంత్ రెడ్డితో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి రాజకీయపరమైన సమాధానం ఇస్తున్నానని పోచారం ఘాటుగానే మాట్లాడారు.
Read Also- Student Death: క్లాస్ రూమ్‌లో 4వ తరగతి విద్యార్థి ఆకస్మిక మరణం.. పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం
‘‘నాకు పదవులపై ఎలాంటి ఆశలు లేవు. కేవలం ప్రజల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిశాను. కార్యకర్తలు దాదాపు రూ.500 కోట్ల విలువైన పనులు చేసి ఉన్నారు. వాళ్లకు నిధులు అందక నిద్రలేని రాత్రులు గడిపారు. ఇంకా వేరే నిధులు కూడా రావాల్సి ఉంది. రేవంత్ రెడ్డితో కలిసి కొంత ఇప్పించగలిగాను. ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చేతనే కొన్ని పరిష్కారం అవుతాయి. కాబట్టి, ఆయన్ను కలవాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఏనాడూ దుర్మార్గపు పని చేయలేదు. ప్రజల కోసమే పని చేశాను. ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకున్నా. అట్లనే బతుకుతా’’ అని పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలని, నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అడగగానే అనేక నిధులను ఇచ్చి బాన్సువాడ అభివృద్ధికి సహకరించారని శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగగానే రూ.వందల కోట్ల అభివృద్ధి నిధులను బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల అభ్యర్థనలు పరిష్కరించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రేవంత్ రెడ్డితో కలిశానంటూ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘‘సాంకేతికంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాను. సాంకేతికంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. స్పీకర్‌కు ఇదివరకు నా అభిప్రాయాన్ని వెల్లడించాను’’ అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని శిరసావహిస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్వార్థం కోసం పార్టీలు మారేందుకు తనకు ఎలాంటి వ్యాపారాలు, భూపంచాయతీలు లేవన్నారు. తనకు ఉన్నదల్లా కేవలం ప్రజలకు సేవ చేయడమేనని, బతికున్నన్ని రోజులు ధర్మంగా ఉండడం మాత్రమేనని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల కోసం తాను తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజలు చెప్పితే పదవుల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
