Telangana: రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు పీఏలతో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ప్రజలకు, లీడర్లకు గ్యాప్ ఏర్పడుతున్నదనే విమర్శలు మొదలయ్యాయి. నేతలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వారి దైనందిన కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పర్సనల్ అసిస్టెంట్లలోని కొందరిపై ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కొందరి పీఏ(PA)ల తీరు నేతలకు, ప్రజలకు మధ్య అగాధాన్ని పెంచుతుండగా, ప్రభుత్వ ప్రతిష్టకు కూడా డ్యామేజ్ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
పక్షపాత ధోరణి
చాలా మంది నాయకులు ప్రజలను కలవడానికి, వారి సమస్యలు వినడానికి పూర్తిగా పీఏలపైనే ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అపాయింట్‌మెంట్‌ల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు, కార్యకర్తలు తమ నాయకులను కలుసుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇదే అంశంపై సాక్షాత్తూ శాసన మండలి చైర్మన్ హౌజ్‌లోనే ప్రస్తావించారు. పీఏలను నమ్ముకొని అజాగ్రత్తగా ఉండవద్దని కోరారు. తాజాగా ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పీఏలను విమర్శిస్తూ ఆమె విడుదల చేసిన వీడియోకు మద్దతు పెరుగుతున్నది.
Also Read: Diwali Movies: తుస్సుమన్న దీవాళి వెండితెర టపాసులు.. ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలే!
పీఏలు ఫెయిల్
ప్రజల వినతులు, ముఖ్యమైన మెసేజీలు, అపాయింట్‌మెంట్లకు సంబంధించిన సమాచారాన్ని నాయకులకు చేరవేయడంలో కొందరు పీఏలు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం లేదా ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ప్రజలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని తెలుస్తున్నది. ముఖ్యంగా అధికార పార్టీ నేతల పీఏలు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తూ, తామే నాయకులుగా భావిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి గతంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనమంటూ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి లీడర్లూ చెబుతున్నారు. నాయకుల పరువు తీసేందుకు పీఏలు ప్రయత్నిస్తున్నారని, వాళ్ల వ్యవహారంతోనే ప్రజలు, లీడర్ల మధ్య దూరం పెరిగి, పార్టీ డ్యామేజ్‌కు కారణమవుతున్నదని ఇటీవల టీపీసీసీలోనూ చర్చ జరిగింది.
వీఐపీలకు పెద్దపీట
అపాయింట్‌మెంట్లు ఇవ్వడం, రద్దు చేయడం వంటి విషయాల్లో పీఏలు స్పష్టత లేకుండా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో దూరం నుంచి వచ్చే సామాన్య ప్రజలు, సమస్యలపై వచ్చే నేతలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. వీఐపీలకు హడావుడిగా అపాయింట్‌మెంట్లు ఇస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొందరు పీఏలు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాంట్రాక్టులు, బదిలీలు, ఇతర పనుల కోసం సిఫార్సు చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి.
నిఘా వర్గాలు దృష్టి పెట్టాలని వినతులు
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాల వరకు చాలా చోట్ల ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు స్వయంగా కాంగ్రెస్ నేతలే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీఏల ప్రవర్తనపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని క్షేత్రస్థాయి లీడర్లు, ప్రజలు కోరుతున్నారు. అంతేగాక ప్రజలను కలిసేందుకు మరింత పారదర్శకమైన విధానాలను ఏర్పాటు చేసే దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆయా లీడర్లకు, పార్టీకి నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Fingerprint Astrology: చావు గురించి ముందే చెప్పే ఆలయం ఉందని మీకు తెలుసా.. ఎక్కడ ఉందంటే?
