Diwali Movies: ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా విడుదలయ్యే భారీ చిత్రాల కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగ సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుందని, కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ ఆశించారు. కానీ ఈ సంవత్సరం దీపావళికి విడుదలైన చిత్రాలు (Diwali Movies) మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. మొత్తం నాలుగు సినిమాలు విడుదలైనా, ఒక్కటి కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీపావళి స్పెషల్‌గా విడుదలైన చిత్రాల ఫలితాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొదటగా విడుదలైన చిత్రం ‘మిత్రమండలి’ (Mithra Mandali). ఈ సినిమా మొదటి ఆట నుంచే తీవ్రమైన నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కథ, కథనం ప్రేక్షకులకు ఏ మాత్రం కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమా డీలా పడింది.
అన్నీ తుస్సే..
ఆ తర్వాత విడుదలైన మరో రెండు సినిమాలు ‘తెలుసు కదా’ (Telusu Kada), ‘డ్యూడ్’ (Dude) కూడా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మాత్రమే రాబట్టుకోగలిగాయి. ఈ సినిమాలకు కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఓకే అనిపించినా, అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో పండుగ ఉత్సాహం ఈ సినిమాలపై ప్రభావం చూపలేకపోయింది. ఇక దీపావళి బరిలో ఉన్న చివరి చిత్రం యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘కె ర్యాంప్’ (K Ramp), అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ అబ్బవరం గత చిత్రం ‘క’ భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద సౌండ్ చేస్తుందని సినీ వర్గాలు భావించాయి. చిత్ర ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ వంటి సినిమాపై భారీగా హైప్‌ని క్రియేట్ చేయగా.. ఈ చిత్రం కూడా ‘తుస్సు’మన్నట్లుగా తేలిపోయింది. సినిమా విడుదలైన వెంటనే ప్రతికూల టాక్ రావడంతో, ప్రేక్షకులను మెప్పించడంలో ఇది కూడా విఫలమైంది.
Also Read- Unbelievable Creativity: ఇంత క్రియేటివిటీనా?.. అండర్‌వేర్‌తో ఓ మహిళ ఏం తయారు చేసిందో తెలుసా?
ఒక్కటంటే ఒక్కటి కూడా పేలలే!
మొత్తంగా, ఈ దీపావళి సీజన్‌కి వచ్చిన నాలుగు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో తీవ్రంగా తడబడ్డాయి. సాధారణంగా దీపావళికి తారాజువ్వలా వెలగాల్సిన సినిమాలు, ఈసారి తుస్సుమన్న టపాసులుగా మిగిలిపోయి, సినీ అభిమానులను డిజప్పాయింట్ చేశాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పండుగ సీజన్‌లో టాలీవుడ్‌కి రావాల్సిన వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ ఫలితం పట్ల సినీ పరిశ్రమ కూడా ఆందోళన చెందుతోంది. ఫైనల్‌గా ఈ దీపావళి స్పెషల్‌గా వచ్చి సినీ క్రాకర్స్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా పేలలేదనే చెప్పుకోవాలి. చూద్దాం మరి.. ముందు ముందు ఏమైనా పుంజుకుంటాయేమో. ఈ రిజల్ట్ తర్వాత ఈ వారం అంతా ఓటీటీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందనేలా టాక్ వినిపిస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
