Nepalese Gangs: నేపాలీలను పనిలో పెట్టుకుంటున్నారా..? ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి.. తాజాగా కార్ఖానా స్టేషన్ పరిధిలో జరిగిన దోపిడీ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు చేస్తున్న హెచ్చరిక ఇది. నమ్మకంగా పనిలో చేరి ఉన్నదంతా దోచుకునే నేపాలీలను పట్టుకోవడం దాదాపుగా అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి వాళ్లు స్వదేశానికి చేరుకున్నారంటే అంతే సంగతులని అంటున్నారు.
8 నుంచి 10 మంది..
పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం.. నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న నేపాలీలు కొందరు గ్యాంగులుగా ఏర్పడి దోపిడీలు.. దొంగతనాలు చేస్తున్నారు. ఒక్కో గ్యాంగులో 8 నుంచి 10మంది సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరిద్దరు పెళ్లయిన వారు ఉంటారు. ఆ తరువాత మన దేశంలోని వేర్వేరు మెట్రోపాలిటన్ సిటీలకు చేరుకుంటారు. ఇక్కడకు వచ్చిన తరువాత వేర్వేరుగా విడిపోతారు. సంపన్నుల ఇండ్లను ఎంపిక చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. భర్త వాచ్‌మెన్‌గా చేరితే భార్య ఇంట్లో పనికి కుదురుతుంది. ఆ తరువాత కష్టపడి పనిచేసి యజమానుల నమ్మకాన్ని సంపాదిస్తారు. ఈ క్రమంలో ఇంట్లో నగలు, నగదు ఎక్కడెక్కడ దాచి పెడుతున్నారన్నది తెలుసుకుంటారు. అవకాశం రాగానే సహచరులను పిలిపించుకుని ఉన్నదంతా ఊడ్చుకెళుతున్నారు. కార్ఖానా స్టేషన్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఆర్మీలో కల్నల్‌గా పని చేసి రిటైరైన గిరి ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులు రాజు, పూజ కలిసి శనివారం రాత్రి నలుగురు సహచరులను పిలిపించుకుని రూ. 50లక్షలకు పైగా సొత్తును దోచుకుని పరారయ్యారు. అయితే, నేపాలీ గ్యాంగులు ఇలా దోపిడీలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూకట్పల్లి వివేకానందనగర్‌కు చెందిన వ్యాపారి దామోదర్ రావు ఇంట్లో నేపాల్ దేశానికి చెందిన భార్యాభర్తలు చక్రధర్, సీత మూడేళ్ల కుమారుడితో కలిసి పనిలో చేరారు. ఆ తరువాత తమ బంధువు అంటూ ఓ వ్యక్తిని తీసుకొచ్చి తమకిచ్చిన గదిలోనే ఆశ్రయం కల్పించారు. ఆ తరువాత యజమాని కుటుంబ సభ్యులు ఓ విందు కోసం బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న రూ.30 లక్షల నగదు, 25లక్షల విలువ చేసే బంగారు నగలను దోచుకుని పరారయ్యారు. సైనిక్‌పురిలో నర్సింహారెడ్డి అనే వ్యాపారి ఇంటి నుంచి కూడా నేపాలీలు ఇదే తరహాలో లక్షల విలువ చేసే సొత్తును కొల్లగొట్టారు. ఇలా చెబుతూ పోతే పదుల సంఖ్యలో ఉదంతాలున్నాయి.
Also Read; PM Narendra Modi: నితీష్ మిత్రపక్షాలకు అభినందనలు: ప్రధాని మోదీ
దొరకడం కష్టమే..
దోపిడీలు.. దొంగతనాలు చేసి పరారవుతున్న నేపాలీలను పట్టుకోవడం కష్టమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి ఆపరేషన్ నేపాల్ అని ప్రత్యేకంగా దర్యాప్తు జరిపారు. దీంట్లో పలు సంచలన వివరాలు వెలుగు చూశాయి. నేరం చేసిన తరువాత వీలైనంత తక్కువ సమయంలో ఈ ముఠాలు స్వదేశానికి చేరుకుంటాయి. దొంగిలించిన సొత్తును నేపాల్‌లోనే తక్కువ రేటుకు అమ్మకుంటారు. వచ్చిన డబ్బుతో ఆస్తులు కూడబెట్టుకుంటారు. జల్సా జీవితం గడుపుతారు. ఇక, ఈ గ్యాంగుల్లో ఉండే చాలామంది సభ్యులకు రెండేసి ఇండ్లు ఉంటాయి. ఓ ఇల్లు మైదాన ప్రాంతంలో ఉంటే మరో ఇల్లు గుట్టలపై ఉంటుంది. పోలీసులు వచ్చారని తెలియగానే మైదాన ప్రాంతాలను వీడి గుట్టలపై ఉండే ఇండ్లకు చేరకుంటారు. అక్కడి నుంచి పోలీసుల కదలికలపై కన్నేసి పెడతారు.
ఎన్నిసార్లు హెచ్చరించినా…
ఎన్నిసార్లు హెచ్చరించినా చాలా మంది ఎలాంటి వెరిఫికేషన్లు జరిపించకుండానే నేపాలీలను ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం కాస్త తక్కువ జీతాలకు పని చేయడానికి వాళ్లు ముందుకొస్తుండటమే అని అన్నారు. కాసిన్ని డబ్బులు మిగుల్చుకోవడానికి వీళ్లను పనిలో పెట్టుకుంటున్న కొందరు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ముఖ్యంగా నేపాలీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పనిలో పెట్టుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలన్నారు. వీలైతే ఏజెన్సీ ద్వారా పనిలో పెట్టుకోవాలని సూచించారు. స్థానిక పోలీసులకు పనిలో పెట్టుకోబోతున్న వారి ఆధార్‌కార్డు, ఇతర వివరాలు అందించి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. అప్పుడే ఇలా నేరాలు చేస్తున్న వారిని అడ్డుకోవచ్చని చెప్పారు.
Also Read: Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..
