NTR: నాడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నాటిన మొక్క.. నేటికీ సిరుల పంట కురిపిస్తూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్ని తుఫానులు వచ్చినా.. ఎంతమంది నరికినా మళ్లీ మళ్లీ పడి లేచిన కెరటంలా నిలబడుతోంది. అలా రైతు గడ్డిపాటి సత్యనారాయణ ఇంట్లో ఆదాయ సంపదను వనకూర్చుతోంది. ఇంతకీ నాడు అన్నగారు నాటిన మొక్క ఏంటనే కదా మీ సందేహం.. అదేనండోయ్ ఆయిల్ ఫామ్. పూర్తి వివరాల్లోకెళితే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయిల్ ఫామ్ మొక్కను (Oil Palm) నాటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం సీతాపురం గ్రామంలోని ఉండవల్లి ఇంద్రారావు పొలం నుంచి మొక్క తెప్పించారు. అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేటం మండలం జగ్గారం గ్రామానికి చెందిన గడ్డిపాటి సత్యనారాయణ అనే రైతు పంట క్షేత్రంలో మొట్టమొదటి ఆయిల్ ఫామ్ మొక్కను ఎన్టీఆర్ తన చేతుల మీదుగా నాటారు. ఇప్పుడు ఆ మొక్క విత్తనాలను రైతులకు ప్రభుత్వం పంచుతోంది. వాస్తవానికి నాడు మలేషియా నుంచి ఈ మొక్కను తీసుకొచ్చి.. గోదావరి జిల్లాలో నాటారు. అక్కడ్నుంచి ఓ మొక్కను తెచ్చి అశ్వరావుపేటలో ఎన్టీఆర్ నాటారు. కాగా, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో ఎన్టీఆర్, నాటి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటూ ఉంటారు. అప్పటినుంచి ఆ ఆయిల్ ఫామ్ మొక్క నేడు మహావృక్షమై సిరుల సంపదను కురిపిస్తోంది. ఆ ఆయిల్ ఫామ్ మొక్క దినదినాభివృద్ధి చెందుతూ రైతుకు అధిక లాభాల పంట పండిస్తోంది. నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆయిల్ ఫామ్ పంటపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులకు పట్టాదారు పాసుబుక్ లేకపోయినా సరే.. సాదా బైనామా మీద ఉన్న వ్యవసాయ భూములకు సైతం ఆయిల్ ఫామ్ మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పథకం, ఎరువులు సబ్సిడీపై అందించే విధంగా కృషి చేస్తున్నారని ప్రస్తుత తెలుగు రైతు అధ్యక్షుడు గడ్డిపాటి సత్యనారాయణ వెల్లడించారు.
Read Also- Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!
ముందడుగు..
ఎన్టీఆర్ ఆయిల్ పామ్ మొక్కను నాటడం అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అదొక కీలక ముందడుగు. అప్పట్లో ఆయిల్ పామ్ సాగు అంతగా ప్రాచుర్యంలో లేదు. రైతులు కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అలాంటి సమయంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా మొక్కను నాటి, దాని ఆవశ్యకతను వివరించడం ద్వారా రైతుల్లో అవగాహన పెరిగింది. సాగు చేయడానికి ప్రోత్సాహం లభించినట్లు అయ్యింది. రాష్ట్రంలో వంటనూనెల దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యంతో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది. ఆయిల్ పామ్ నుంచి అధిక దిగుబడి వచ్చే వంట నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా (ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు) ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన నేలలు. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే నాటి నుంచి నేటి వరకూ ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ సాగుకు కేంద్రంగానే ఉన్నది. ఇప్పుడు వందలు, వేలాది ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. ఇంకా చెప్పాలంలే తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రాంతం పామ్ ఆయిల్ సాగు కేంద్రం. ఇక్కడ్నుంచి దేశ, విదేశాలకు కూడా ఆయిల్ ఎక్కువగా సరఫరా చేస్తుంటారని రైతులు చెబుతుంటారు.
Read Also- KTR: అరెరే.. కేటీఆర్‌కు పెద్ద చిక్కొచ్చి పడిందే.. ఆధారాలతో దిమ్మతిరిగేలా కొట్టారుగా!
నాడు.. నేడు!
ఆయిల్ పామ్ సాగు విస్తరణలో ఎన్టీఆర్ పూర్తి సహాయ సహకారాలు అందించడం, ఆయన ప్రోత్సాహంతోనే నాటి, నేటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఎడ్యుకేట్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. నాడు ఎన్టీఆర్ నాటిన ఆయిల్ పామ్ మొక్క.. నేడు ఒక పెద్ద చెట్టుగా మారింది. ఆ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలు భారీగా విస్తరించాయని స్థానికులు చెబుతారు. ఆయిల్ పామ్ సాగుకు ఎన్టీఆర్ వేసిన పునాది ఫలితంగా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు నేడు ఆయిల్ పామ్ సాగులో ముందున్నాయి. చాలా మంది రైతులు సాంప్రదాయ పంటల నుంచి ఆయిల్ పామ్‌కు మారి ఆర్థికంగా లాభపడ్డారు కూడా. ఈ సంఘటన ఎన్టీఆర్ దూరదృష్టికి, వ్యవసాయ రంగం అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) సైతం రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంటనూనెలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయిల్ పామ్ సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటి వరకూ ఆయిల్ పామ్ సాగు విస్తరణకు తెలంగాణలోని 31 జిల్లాల్లో 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో సుమారు 2.43 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగులోకి వచ్చింది.
Read Also- Raja Singh vs Kishan Reddy: రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్.. ఏం జరగబోతోంది?