Gadwal development: ప్రస్తుతం ఉన్న జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రాజెక్టుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే గత ప్రభుత్వం కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు నెలల క్రితం జూరాల ప్రాజెక్టును సందర్శించి, నూతన బ్రిడ్జి నిర్మాణానికి హామీనిచ్చారు. ఆ హామీ మేరకు, గద్వాలకు సమీపంలోని కొత్తపల్లి నుంచి ఆత్మకూరు సమీపంలోని జూరాల వరకు కృష్ణానదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయి. ఇందుకుగాను ₹123 కోట్లు కేటాయిస్తూ టెండర్ల ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తి చేశారు.
డిసెంబర్ 1న సీఎం భూమి పూజ..
ఈ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న ఆత్మకూరుకు సమీపంలోని జూరాల వద్ద భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రమంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి జూరాల గ్రామం దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు.
భారీగా తగ్గనున్న ప్రయాణ దూరం..
ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల గద్వాల జిల్లా ప్రజలతోపాటు రాయచూర్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, నాగలదిన్నె ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ వెళ్లేందుకు ఎంతో దూరాన్ని, సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం గద్వాల నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా ఆత్మకూర్ వెళ్లేందుకు 32 కిలోమీటర్లు దూరం అవుతుంది. కొత్తపల్లి సమీపంలోని కృష్ణా నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ కం రోడ్డు నిర్మాణం పూర్తయితే, ఈ దూరం కేవలం 10 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీనివల్ల కొత్తకోటకు 26 కిలోమీటర్లు కావడంతో, గద్వాల నుంచి కొత్తకోట మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణంలో దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఆదా అవుతుంది.
Also Read: Jogulamba Gadwal: మూగ జీవాల రోధన పట్టదా? మందుల కొరతతో జీవాల ఆరోగ్య క్షీణత
ప్రారంభమైన మట్టి నమూనాల ప్రక్రియ
బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గద్వాల సమీపంలోని నుంచి కృష్ణానది వరకు మట్టి నమూనాల సేకరణ ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే కొత్తపల్లికి సమీపంలోని పీజేపీ మెయిన్ కెనాల్ దగ్గర, కొత్తపల్లి గ్రామ సమీపంలోని కృష్ణా నది దగ్గర మట్టి నమూనాలను సేకరించారు. కొత్తపల్లి నుంచి జూరాల మధ్య నిర్మించే ఈ హై లెవెల్ బ్రిడ్జి 750 మీటర్ల వరకు ఉంటుంది. అలాగే, కిష్టారెడ్డి బంగ్లాకు సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి కొత్తపల్లి మీదుగా జూరాల వరకు మొత్తం 10 కిలోమీటర్ల డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, కృష్ణా నదికి వరద తాకిడి తగ్గిన తర్వాత జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
మా ప్రాంతం అభివృద్ధి
కృష్ణా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షనీయం. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రాకపోకలకు సౌలభ్యం కలిగి సమయం ఆదా అవుతుంది. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కృషి వల్లే ఈ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి కృతజృతలు.
– అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్
Also Read: US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?

