US Deportation: పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జీత్ కౌర్ అనే సిక్కు వృద్ధురాలి పట్ల అమెరికా అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. అమెరికా నుంచి భారత్‌కు పంపించే (US Deportation) క్రమంలో యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి (ICE) చెందిన ఓ అధికారి వృద్ధురాలి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కాళ్లకు చైన్లు, చేతికి బేడీలు వేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నాన్ని మరో అధికారి అడ్డుకున్నారని వృద్దురాలి న్యాయవాది మీడియాకు తెలిపారు. అమెరికా డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా 131 మందితో కూడిన విమానం గురువారం సాయంత్రం భారత్‌కు చేరుకుంది. కాలిఫోర్నియాలో యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారుల సాధారణ చెక్-ఇన్ సమయంలో వృద్ధురాలు హర్జీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
భారత్‌కు వచ్చిన అనంతరం, ఆమె న్యాయవాది దీపక్ అహ్లూవాలియా వివరాలు తెలిపారు. 131 మందిని డిపోర్ట్ చేసిన ఈ విమానంలో అందరి పట్ల దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. కాగా, అమెరికా నుంచి డిపోర్ట్ చేస్తున్న సమయంలో పురుషులు, లేదా మహిళలకు చైన్లు వేసి పంపించడంపై ఇదివరకే తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో డిపోర్టీ ఫ్లైట్లలో భారతీయులకు బేడీలు వేసి మరీ పంపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది.
పెద్ద వయస్కురాలైన హర్జిత్ కౌర్‌ను ప్యాసింజర్ల విమానాల్లో టికెట్లతో పంపించడానికి బదులు, ఐసీఈ అధికారులు ఒక చిన్న ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో పంపించారన్నారని మండిపడ్డారు. ఆ విమానంలో తగిన మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైట్‌లో హర్జీత్ కౌర్ ఫ్లోర్‌పైనే నిద్రపోవాల్సి వచ్చిందని, కనీసం స్నానం చేయడానికి కూడా అవకాశం కల్పించలేదని న్యాయవాది దీపక్ అహ్లువాలియా పేర్కొన్నారు.
కాగా, హర్జీత్ కౌర్ మడమలకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో, విమానంలో ఫ్లోర్‌పై నిద్రపోవడంతో మేల్కొన్న తర్వాత పైకి లేవడానికి నరకయాతన అనుభవించారని న్యాయవాది తెలిపారు. హర్జీత్ కౌర్ 1992లో ఇద్దరు కొడుకులతో ఒంటరి తల్లిగా అమెరికా వెళ్లారు. అప్పటినుంచి ఉత్తర కాలిఫోర్నియాలోని ఈస్ట్ బే ప్రాంతంలో 30 ఏళ్ల పాటు నివాసం ఉన్నారు. హర్జీత్ కౌర్‌కు లీగల్ డాక్యుమెంట్స్ లేకపోయినా, అమెరికా చట్టాల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐసీసీ (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కార్యాలయానికి హాజరయ్యే విధంగా విధించిన నిబంధనను గత 13 ఏళ్లుగా ఆమె పాటించారని కోడలు మంజీ కౌర్ పేర్కొన్నారు.
హర్జీత్ కౌర్‌ను అవమానకరంగా డిపోర్ట్ చేయడంపై అమెరికా డెమోక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు జాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక 73 ఏళ్ల వృద్ధురాలు, నేర రికార్డు లేని గౌరవనీయ వ్యక్తిని దేశం నుంచి పంపించేయడం ఏమిటి? అని ట్రంప్ ప్రభుత్వ విధానాలను ఆయన ప్రశ్నించారు. కాగా, హర్జీత్ కౌర్ 2012లో ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ, తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ ఆమె అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆమె స్వయంగా భారత దౌత్య కార్యాలయం (Indian Consulate) వద్ద పత్రాలు కూడా కోరిందని కోడలు మంజీ కౌర్ తెలిపారు. అయితే ఆ పత్రాల కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరించారని ఆమె వివరించారు.