Suryapet District (imagecredit:swetcha)
నల్గొండ

Suryapet District: సీఎంఆర్‌లో సూర్యాపేట జిల్లా వెనుకంజ.. కారణం అదేనా!

నల్లగొండ బ్యూరో స్వేచ్చ: Suryapet District:అది సూర్యాపేట జిల్లా.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా లేని ప్రత్యేకత ఆ జిల్లాది. ఆసియాలోనే అత్యధికంగా రైసు మిల్లులు ఉన్న ప్రాంతమైన మిర్యాలగూడ తర్వాతి స్థానం ఈ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట నియోజకవర్గాలదే. నిజానికి ఈ స్థాయిలో రైసు మిల్లులు ఉంటే రైతాంగం తమ వరి పంటను అమ్ముకునేందుకు ఏలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. కానీ సూర్యాపేట జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నం. క్షేత్రస్థాయిలో రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండానే నకిలీ తక్‌పట్టీలు సృష్టించి రూ.కోట్లు కోల్లగొట్టడం జిల్లాలోని కొంతమంది మిల్లర్లకు అలవాటు. దీనికి రాజకీయ నేతల అండదండలు పుష్కలం. సూర్యాపేట జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏటా పెద్దఎత్తున అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అక్కడి అధికారులకేం పట్టదు. అయితే ఇదంతా పక్కనపెడితే.. తాజాగా అధికారులు మరో కొత్త తరహా దందాకు తేరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంతకీ ధాన్యం కొనుగోళ్లలో ఆ నయా దందా ఏంటో చూద్దాం..

సూర్యాపేట జిల్లాలో ఇదీ పరిస్థితి.. 

సూర్యాపేట జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా మిల్లులకు అలాట్ చేయడంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు మొదట్నుంచీ విన్పిస్తున్నాయి. ఇదే సమయంలో మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించకుండా కొత్త దందాకు లేపిన ఉదంతాలు లేకపోలేదు. ఫలితంగా మిల్లర్లు సీఎంఆర్ కింద భారీగా ప్రభుత్వానికి బకాయి పడ్డారు. అయితే దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం 50 శాతం సీఎంఆర్ చెల్లించిన మిల్లులకే ధాన్యం అలాట్ చేయాలని గతంలో నిర్ణయించింది. కానీ సూర్యాపేట జిల్లా అధికారులు మాత్రం నిబంధనలను పక్కకు పెట్టి 25 శాతం సీఎంఆర్ చెల్లించని మిల్లర్లకు సైతం కొత్తగా ధాన్యం అలాట్ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం అధికారులు మాముళ్ల మత్తుకు అలవాటు పడడం ఒక ఎత్తయితే.. ప్రజాప్రతినిధుల నుంచి రాజకీయ ఒత్తిళ్లు మరో కారణంగా చెప్పొచ్చు.

సూర్యాపేట జిల్లాలో రూ.623 కోట్లు పెండింగ్..  

సూర్యాపేట జిల్లాలో మొత్తం రూ.623 కోట్ల విలువైన 1.71 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉండగా, వీటిలో 8 మిల్లులలో రూ.518 కోట్ల విలువ చేసే 1.43 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు మాయం చేశారని బహిరంగ విమర్శలున్నాయి. అయితే గత సర్కార్‌ను అడ్డం పెట్టుకొని మిల్లులలో ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లు బినామీ పేర్లతో కొత్తగా మిల్లులకు ఏర్పాటు చేసుకొని సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించేలా చేసుకున్నారు. మరోపక్క గతంలో అక్రమాలు బయటపడిన కూడా ఎఫ్‌సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేసినా ధాన్యం లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్ల ను పక్కన పెట్టి లోతైన విచారణ జరిపితే కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావడం ఖాయం.

కొంపముంచిన గడువు పొడగింపు..  

సీఎంఆర్ విషయంలో గడువులను వరుసగా పొడగించడంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడిందని చెప్పాలి. 2022 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ గడువును ఇప్పటి వరకు పెంచుతూ రావడంతో రైస్ మిల్లర్లు ఆ అవకాశాన్ని సద్వినియోగం పేరిట దుర్వినియోగం చేసి రూ.కోట్లలో ఆక్రమాలకు తెరలేపారు. గడువు పొడగింపు కారణంగా ఓ ఖరీఫ్, రబీసీజన్లకు సంబందించిన ధాన్యం లెక్కలను మిల్లర్లు తలకిందులు చేసి అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ సీజన్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మరో సీజన్ ధాన్యంగా చూపుతూ అధికారుల కళ్లకు గంతలు కట్టినంత పని చేశారని అంటున్నారు. అధికారులు సైతం లోతుగా ధాన్యం నిల్వలపై విచారణ జరపకపోవడం రైస్ మిల్లర్లకు కలిసి వచ్చిందని విమర్శలు లేకపోలేదు.

బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటుర్రు..  

రైతుల నుంచి ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా మార్చి ఇచ్చేందుకు జిల్లాలోని రైసు మిల్లులకు కేటాయిస్తారు. అయితే ఈ సీఎంఆర్ ప్రక్రియ అనేది అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొంతమంది మిల్లర్లు అనుకున్న సమయానికే సీఎంఆర్ ఇస్తున్నా.. మరికొంతమంది మాత్రం ధాన్యం బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకుండానే బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

2022 యాసంగి సీజనుకు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటివరకు 50 శాతం ఇవ్వని మిల్లులు ఒక్క సూర్యాపేట జిల్లాలోనే దాదాపు 10 వరకు ఉన్నాయని తెలుస్తోంది. 50 నుంచి 60 శాతం చెల్లించినవి మరో 10 వరకు ఉంటాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సీఎంఆర్ చెల్లించకున్నా.. ధాన్యం కేటాయించిన తీరుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో సీఎంఆర్‌ను స్వాహా చేసేందుకు మిల్లర్లకు దొంగల చేతికి తాళాలు ఇచ్చిన చందంగా మారుతుందనడంలో ఏలాంటి సందేహం లేదు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు