Bhoobharati Act: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల తలెత్తిన భూ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం( Bhoobharati Act) కింద నల్లగొండ జిల్లా(Nalgonda District)లో వేలాది దరఖాస్తులు వచ్చాయి. అయితే, వీటిని పరిష్కరించేందుకు కేటాయించిన గడువు ముగుస్తున్నా, క్షేత్రస్థాయిలో ఉన్న అనేక చిక్కుముడుల కారణంగా చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. గడువులోగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Farah Khan – Shruti Haasan: బ్లాక్ నైఫ్.. ఫరా ఖాన్ – శృతి హాసన్ మధ్య ఆసక్తికర సంభాషణ!
భూభారతి దరఖాస్తుల పరిస్థితి..
నల్లగొండ జిల్లా(Nalgonda District) వ్యాప్తంగా జూన్ 3 నుంచి 20 వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 43,500కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఈ నెల 15లోగా పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. కానీ, డీటీలు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. భూ పంపిణీలో తేడాలు, సర్వే నంబర్ల మిస్సింగ్, రికార్డుల్లో ఒకరి పేరు ఉండి, మరొకరు సాగులో ఉండటం, రికార్డుల్లో పేర్లు తారుమారు అవడం వంటి సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
సాదాబైనామాలపై అస్పష్టత..
భూభారతి దరఖాస్తుల్లో చాలావరకు సాదాబైనామాలకు సంబంధించినవే. నల్లగొండ జిల్లాలో ఇలాంటి దరఖాస్తులు 6,793 దాకా ఉన్నాయి. అయితే, సాదాబైనామాలపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున, ఈ దరఖాస్తుల పరిష్కారానికి ప్రస్తుతం ఆటంకం ఏర్పడింది. గత ప్రభుత్వం 2020లో మీ-సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పగా, రైతులు 2023 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
రీ-సర్వేతో పరిష్కారం?
భూ విస్తీర్ణాల్లోని వ్యత్యాసాలు, రికార్డులకు, వాస్తవ సాగుకు మధ్య ఉన్న తేడాలను పరిష్కరించడానికి రీ-సర్వే చేయాలని భూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా చోట్ల భూమిలేనివారికి పాస్ పుస్తకాలు ఉండటం, కొంతమంది భూమిని ఆక్రమించుకున్నా వారికి రికార్డుల్లో పేరు లేకపోవడం వంటి సమస్యలు రైతుల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి సమస్యల వల్ల న్యాయపరమైన చిక్కులు వస్తాయనే భయంతో అధికారులు దరఖాస్తులను పక్కన పెడుతున్నారని తెలుస్తోంది. రీ-సర్వే లేదా ఎంజాయ్‌మెంట్ సర్వే వంటివి ఈ సమస్యలకు పరిష్కారం చూపగలవని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Mulugu District: ‘మా సమస్యలు పరిష్కరించండి’.. రైతు కమీషన్ ఛైర్మన్‌కు ఆదివాసీల విజ్ఞప్తి!