Musi river: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మహానగరవాసులు దాహర్తిని తీర్చే ఉస్మాన్ సాగర్(Usman Sagar), హిమాయత్ సాగర్( Himayat Sagar) జంట జలాశయాల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో జంట జలాశయాలు క్రమంగా నిండుతున్నాయి. ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎగువ ప్రాంతాలైన అనంతగిరి హిల్స్, శంకర్ పల్లి, బుల్కాపూర్, టంగటూర్, చిందిప్ప, చేవేళ్ల, వికారాబాద్, కమ్మెట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవటంతో జలాశయాలకు క్రమంగా ఎన్ ఫ్లో పెరుగుతుంది. గడిచిన నాలుగేళ్ల నుంచి ప్రతి వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావటంతో జంట జలాశయాల గేట్లు ఎత్తి ఇన్ ఫ్లో కు తగిన విధంగా ఔట్ ఫ్లోను విడుదల చేస్తుంటారు.
కానీ ఈ సారి కాస్త ముందుగానే జలాశయాల్లోకి భారీగా వరద నీరు రావటంతో నేడో, రేపో జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తుంది. తొలుత దిగువ ప్రాంతాలైన రాజేంద్రనగర్, మూసీ పరివాహాక ప్రాంతాలైన పాతబస్తీ, చాదర్ ఘాట్, అంబర్ పేట తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో మూసీకి కూడా వరద ఉద్ధృతి పెరగనుంది. ఇన్ ఫ్లో కు తగిన విధంగా ఔట్ ఫ్లోగా నీటిని విడుదల చేసేందుకు అధికారులు దిగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read: Cigarette Boxes Robbery: అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
రిజర్వాయర్ల నీటి మట్టాలు
ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1782.80 అడుగులు (2474 టీఎంసీలుగా ఉన్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. ఈ రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ ఫ్లో వంద క్యూసెక్కులుగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పాటు హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1761.05 అడుగులు (2447 టీఎంసీలు)లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో సుమారు 300 క్యూసెక్కులుగా ఉన్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
నిండుతున్న హుస్సేన్ సాగర్
తరుచూ కురుస్తున్న వర్షాల కారణంగా నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ క్రమంగా నిండుతుంది. హుస్సేన్ సాగర్(Hussain Sagar) పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్ట నీటి మట్టం 514.75 మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 513.18 మీటర్లుగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు వెల్లడించారు. సాగర్ క్రమంగా నిండుతుండటంతో ఔట్ ఫ్లోను జీహెచ్ఎంసీ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరిన తర్వాత సర్ ప్లస్ నాలా ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Urfi Javed: ట్రోల్స్ చేసినవారికి ధీటుగా రిప్లై ఇచ్చిన ఉర్ఫీ జావెద్.. బొమ్మ అదిరిందిగా