Municipal Elections: ఇక పురపోరు సందడి!
మున్సిపాల్టీల్లో ఎన్నికల కోలాహలం
రిజర్వేషన్ల ఖరారుకై ఎదురుచూపులు
ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ
నాగర్‌కర్నూల్, స్వేచ్ఛ: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు కూడా స్వీకరించి, తమ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో, పల్లెల్లో రాజకీయ వేడి తగ్గింది. అయితే, పురపాలికల్లో ముందస్తుగానే ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 10న ఓటర్ల తుదిజాబితా ఖరారు చేయనుండటంతో పట్టణాల్లో ఎన్నికల వేడి (Municipal Elections) ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టనుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల ఖరారు విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే పాలకవర్గాల గడువు ముగిసింది. దీంతో మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారులకు పరిపాలన కొనసాగుతోంది. అప్పటినుంచి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియగా తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 10న ఓటర్ల జాబితా ప్రచురణకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల ఆధారంగా వార్డులు విభజన రిజర్వేషన్ల ఖరారు జరగనుంది.
Read Also- New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరొద్దు.. ఖమ్మం పోలీస్ కమిషనర్ వార్నింగ్
నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఆశావహులు పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు కార్యచరణ ప్రారంభించడంతో వారిలో ఆసక్తి నెలకొంది. జనవరి 10లోగా తుది ఓటర్ల జాబితా వెలువరించనుంది. ఇక రాష్ట్ర మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి జనవరి ఆఖరిలో ఎన్నికలు ఉంటాయని పేర్కొనడం, అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు కొత్త ఆశలు రేకెత్తాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగిలిన 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండటం ఆ పార్టీకి సానుకూల అంశం. ఇక మున్సిపాలిటీలో వార్డుల విభజన ఏ విధంగా ఉంటుందోనని, అలాగే రిజర్వేషన్లు ఎలా ఉంటాయని దానిపై ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. ఆయా వార్డుల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన కౌన్సిలర్లు వార్డులు రిజర్వేషన్లు తమ వార్డులు అలాగే ఉంటాయా, మారుతాయోననే సందేహాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత రానుండటంతో పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొననుంది.
Read Also- Huzurabad News: ప్రభుత్వ భూమిని కాపాడలేరా? అధికారులారా అంటూ.. మొలంగూరు నేతల ఘాటు విమర్శలు!

