MLA Kaushik Reddy: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. నా గెలుపు కోసం మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మీ గెలుపు కోసం నేను కష్టపడతా అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి తన శక్తి మొత్తం వినియోగిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల కృషి వల్లే తాను గెలిచానని నియోజకవర్గ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్(KCR) వందల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
పార్టీ ఆదర్శాలపై విశ్వాసం..
ప్రస్తుత పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా రైతులు యూరియా(Urea) కోసం ఎడా పెడా తిరిగేందుకు కారణం ప్రభుత్వ తీరేనని మండిపడ్డారు. యూరియా సరిగా అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కే లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్(KCR) పై తన విశ్వాసాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కౌశిక్ రెడ్డి కేసీఆర్ నన్ను పిలిచి ఎమ్మెల్సీగా అనంతరం ప్రభుత్వ విప్‌గా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) దగ్గర నుండి కింది స్థాయి నాయకుల వరకు పరిచయాలున్నప్పటికీ పదవుల ఆశతో పార్టీ మారలేదని తెలిపారు. మంత్రి(Minister) లేదా ఎంపీ(MP) పదవి ఆకర్షణలకు లొంగకుండా పార్టీ ఆదర్శాలపై విశ్వాసంతో కొనసాగానన్నారు. కేసీఆర్ నాకు నాయకుడే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు.
Also Read: Meghalaya Chilli Eater: మిరపకాయలే ఆహారం.. వాటితోనే స్నానం కూడా.. వీడు మనిషి కాదు బాబోయ్!
బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే..
హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి వెళితే వారి ఇంటిముందు వెయ్యి మందితో పోరాటం చేస్తానని హెచ్చరించారు. పార్టీకి ద్రోహం చేసే వారిని సహించేది లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ(MPTC), జడ్పీటీసీ(ZPTC), మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ(BJP) కాంగ్రెస్(Congress) పార్టీల్లో వర్గ రాజకీయాలు ఉన్నా బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే వర్గం కేసీఆర్ వర్గం అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ గ్రామంలోని రైల్వే బ్రిడ్జ్ పనులు బీఆర్‌ఎస్ హయాంలో పూర్తయ్యాయని కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని తెలిపారు. రహదారిపై ఏర్పడిన గుంతలు వాహనదారులను ఇబ్బందిపెడుతున్నాయని సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మణరావు, మాజీ జెడ్పిటిసి నవీన్, సీనియర్ నాయకులు సత్యనారాయణరావు, తిరుపతిరావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
Also Read: ODI captaincy Row: రోహిత్ స్థానంలో గిల్.. కెప్టెన్సీ మార్పు వెనుక ఇంత జరిగిందా?
