Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో 72వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. అందె శ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. 110 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. వేదికపై వాక్ నిర్వహించారు. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. తమ దేశీయ ఆహార్యంతోపాటు తమ దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేష ధారణలతో ఆఫ్రికన్ దేశాలకు చెందిన 22 దేశాల కాంటెస్టర్లు అలరించారు. లాటిన్ అమెరికా దేశాల కాంటెస్టర్లు సైతం ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేష ధారణలతో ఆకట్టుకున్నారు.
కరేబియన్ లాటిన్ అమెరికా తో పోటీదారులు అలరించారు. మొదట అర్జెంటీనా కాంటెస్టెంట్ ర్యాంప్ పైకి వచ్చి వాక్ చేశారు. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారులు ప్రదర్శన విదేశీ అతిధులను ఆకర్షించింది. రెండవ రౌండ్ కంటెస్టెంట్స్ ఆఫ్రికా ఖండం నుంచి అంగోలా తో మొదలైంది. ప్రదర్శన దేశీయ ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుగా సాగింది. లంబాడా కళాకారులు డప్పు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచంలోనే ఒకటైన పురాతన కళగా నిర్వాహకులు ప్రకటించారు. అతిధులు, ఆహుతులు కరతాళ ధ్వనులు చేశారు.
33 దేశాలు యూరప్ ప్రాతినిధ్యం
మూడవ రౌండ్ కంటెస్టెంట్స్ యూరప్ ఖండం నుంచి అల్బేనియా ప్రతినిధితో మొదలైంది. మొత్తం 33 దేశాలు యూరప్ నుంచి ప్రాతినిధ్యం వహించాయి. వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. ఆ తర్వాత జరిగిన ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. జాతీయ జెండాను చేతబూనిన కళాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. చివరి రౌండ్ కంటెస్టెంట్స్ ఆసియా ఓషియానియా నుంచి ర్యాంపు పైకి వచ్చారు. మొత్తం 22 దేశాలు నుంచి ప్రాతినిధ్యం వహించాయి. వారి సంస్కృతి సాంప్రదాయాలను తమదైన శైలిలో ప్రదర్శించారు. మిస్ ఇండియా నందిని గుప్తా వేదికపైకి వచ్చినపుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగింది.
Also Read: Operation Sindoor: పాక్‌కు మరో ఊహించని చావు దెబ్బ.. షాకింగ్ విషయాలు మీకోసం..
ఒక్కసారిగా జోష్ నింపింది.అదే విధంగా చీర కట్టుతో ర్యాంపు పైకి వచ్చిన మిస్ నేపాలి అందరినీ ఆకర్షించింది. కంటెస్టెంట్స్ లో అందరికంటే చివరగా ర్యాంప్ పైకి వచ్చిన మిస్ వియత్నాం తనదైన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. తమ తమ జాతీయ జెండాలు చేతపట్టి ఒకేసారి ర్యాంపు పైకి వచ్చిన 110 దేశాలకు చెందిన ప్రతినిధులు వచ్చారు. దీంతో చూపరులకు దేవలోకం నుంచి తారలు దిగివచ్చినట్లు కనువిందు చేశారు. మూడు రంగుల జెండాతో చివరగా వారితో మిస్ ఇండియా నందిని గుప్తాజత చేరారు. ఆకట్టుకున్నారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వారి ధైర్య సాహసాలకు నిర్వాహకులు సెల్యూట్ చేశారు.
చివరలో మిస్ వరల్డ్ -2024 విజేత క్రిస్టినా పిస్కోవా గీతాలాపన చేయగా అన్ని దేశాల ప్రతినిధులుగొంతు కలిపారు. జాతీయ గీతం ఆలాపన చేశారు. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అయినట్లు సీఎం రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే ప్రకటించారు. ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా మాట్లాడుతూ మిస్ వరల్డ్ అంటే ఒక్క అందమే కాదు, ప్రతిభ, ఆత్మ విశ్వానికి ప్రతీక అన్నారు. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకశాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా భద్రత
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముగిసింది. పరిమిత సంఖ్యలో పాసులు మంజూరు చేసింది. ఎంట్రీ సమయంలో సైతం ఎలాంటి తోపులాట లేకుండా సాఫీగా సాగింది. భద్రతకు మూడంచల వ్యవస్థ ఏర్పాటు చేసింది. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.
Also Read: Hydra: బడా బాబులకు బిగ్ షాక్.. ఆక్రమణలకు పాల్పడితే ఆస్తులు జప్తు!