Minister Sridhar Babu: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటిచ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)అన్నారు. ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ” కార్యక్రమంలో రాష్ట్ర ఐటిశ పరిశ్రమల శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
మహిళా శక్తి చీరల పంపిణీ
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం. ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా “మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి” ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలు నిర్ణయించిన మోడల్ చీరలను పంపిణీకి ఎంపిక చేశామని తెలిపారు. గ్రామ, మండల సమాఖ్య బాధ్యులు చీరల పంపిణీ బాధ్యతను తీసుకొని ప్రతి మహిళకూ చీరలు అందేలా చూడాలని అన్నారు.
Also Read: Harish Kalyan: హరీష్ కళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్.. ప్రోమో అదిరింది
ఎటువంటి సమస్యలున్నా..
మహిళలు ఐక్యంగా ఉండాలనే సందేశంతో చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, బస్సుల కొనుగోలు వంటి వ్యాపారంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం తోడ్పాటునిస్తూ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, సన్న బియ్యం పంపిణీ, తదితర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
మహిళా సంఘాల సభ్యులకు..
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగాలని మహిళలు అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో సోలార్ పవర్ ప్లాంట్ లు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లో భాగస్వామ్యం చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కార్యక్రమానికి హాజరైన వారితో కలిసి జిల్లాలోని మహిళా సమాఖ్య సంఘాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల లాంఛనంగా పంపిణీ చేశారు. జీవన్ జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి 6 వందల 34 కోట్ల 68 లక్షల చెక్కును మంత్రి ఈ సందర్బంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టియుఎఫ్ఐడిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, శాసన సభ్యులు మాల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఆర్ అండ్ బి ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, సంబంధిత అధికారులు, జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kishan Reddy: ప్రతి తలసేమియా బాధితులకు భారీ ఆర్థిక సాయం: కిషన్ రెడ్డి
