Sridhar Babu on KTR:
కేయెన్స్ కంపెనీపై కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం
నిరాధార, అసత్య ప్రచారాలు ఆయనకు అలవాటు
ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ఆరోపణలు
ప్రజలను గాలికొదిలి.. గోబెల్స్ ప్రచారం
తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ
బీజేపీని విమర్శించే ధైర్యం లేకనే ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు
మండిపడిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేయెన్స్ సెమీకండక్టర్ పరిశ్రమ గురించి కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu on KTR) మండిపడ్డారు. కేయెన్స్ పరిశ్రమ హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేటీఆర్ ఆరోపించడం బట్టకాల్చి మీద వేయడం లాంటిదే అన్నారు. నిరాధార, అసత్య ప్రచారాలు చేయడం అయనకు అలవాటేనని దుయ్యబట్టారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
కేయెన్స్ ఇక్కడి నుంచి వెళ్లిపోయిందనడం కంటే కేంద్రం, గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వాలు భారీ సబ్సిడీలు కుమ్మరించి లాక్కుపోయాయని చెప్పడం సబబుగా ఉంటుందన్నారు. ఇది కేటీఆర్ కు తెలుసు అని, అయినా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని మండిపడ్డారు. ప్రజలను గాలికొదిలి వదిలి హైదరాబాద్ లో కూర్చుని రోజూ ఏదో ఒక అంశంపై గోబెల్స్ ప్రచారం చేయడం గులాబి పార్టీ నాయకులకు అలవాటేనన్నారు. ప్రజలు తాము ఏది చెప్పినా నమ్ముతారని ఇంకా అనుకోవడం వారి భ్రమ అన్నారు.
Read Also- Bhupalpally district: భారీ వర్షాలతో భూపాలపల్లి జిల్లా జలమయం
గుజరాత్ లోని సనంద్ లో కేయెన్స్ సెమీకాన్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ కింద ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం సబ్సిడీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రూ.76,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ను నెలకొల్పిన విషయం తెలిసిందే అన్నారు. గుజరాత్ లో ఏర్పాటు చేస్తే దీనికింది 50శాతం సబ్సిడీ వస్తుందనే ప్రచారం మొదలు పెట్టడంతో సహజంగానే సెమీకండక్టర్ పరిశ్రమలు ఆ రాష్ట్రం వైపు చూస్తాయన్నారు. కేయెన్స్ ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం రూ. 3,307 కోట్లు అయితే ఇందులో సెంబ్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద రూ. 1653.5 కోట్లు ఉదారంగా లభిస్తాయని, గుజరాత్ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీలో 40 శాతం అంటే మరో రూ.661 కోట్లు అందజేస్తుందన్నారు.
Read Also- Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
ప్రాజెక్టు వ్యయంపై మొత్తం సబ్సిడీ 70 శాతం అంటే రూ. 2,314.9 కోట్లతో సమానం అన్నారు. కేంద్రం ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఇతర రాష్ట్రాల విషయంలో అంత ఉదారత చూపించదన్నారు. గుజరాత్ అయితే కేంద్ర సబ్సిడీ విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందనే ప్రచారాన్ని సెమీకండక్టర్ పరిశ్రమలు సహజంగానే విశ్వసిస్తాయన్నారు. ఈ సవతి తల్లి ప్రేమ గురించి బీజేపీని విమర్శించే ధైర్యం లేకనే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. గుజరాత్ లో నెలకొల్పే సెమీకండక్టర్ పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు చూస్తే ఒక్క ఉద్యోగానికి రూ.3.2 కోట్ల సబ్సిడీలు లభిస్తున్నాయని కేంద్ర మంత్రి కుమారస్వామి పేర్కొన్నారన్నారు.
