Balkampet Yellamma: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలను, బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయప్రాంగణంలో ఉత్సవాల ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, ఎండోమెంట్ వివిధ శాఖలతో ఆయన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులతో సమావేశం ఉత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా మంత్రి సమక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 1న శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో జరిగే కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాల పై అధికారులు అప్రమత్తంగా ఉండి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
మహిళలకు ఇబ్బందులు లేకుండా
గత సంవత్సరం ఎదురైన ఇబ్బందులు తిరిగి పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీ ,చిన్నపిల్లలు ,మహిళలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గత సంవత్సరం బారికేడ్లు, క్యూలైన్ లలో ఇబ్బందులు తలెత్తాయని, సీసీ కెమెరాల తో నిరంతర భద్రత పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా ఉత్సవాల్లో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చర్యలు తీసుకోవాలని, మొబైల్ ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కేబుల్స్ వ్రేలాడకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ కోసం అదనంగా ప్రత్యేక సిబ్బందిని నియమించటంతో పాటు మొబైల్ టాయిలెట్స్ ను అందుబాటులో ఉంచాలని, మెయిన్ రోడ్డు పై లైటింగ్ డెకరేట్, పెద్ద లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉచిత ఫ్యూరిఫైడ్ మంచినీటి సరఫరా ,అదనంగా వాటర్ ట్యాంకర్ల ఏర్పాటు, హెల్త్ క్యాంప్ లు, అంబులెన్స్ ల ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read: Viral Video: 56 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ.. ఈ రాయల్ వెల్కమ్ చూస్తే మైండ్ పోతుందంతే..!
బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణం
నిరంతర పబ్లిక్ అనౌన్స్ మెంట్, స్క్రీన్ లు ఏర్పాటు చేయాలని, పోలీస్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని అమ్మవారి కళ్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కళ్యాణం ,రథోత్సవం నాడు సమాచార శాఖ ,పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ అధికారులు కంట్రోల్ రూమ్ నుండి మానిటరింగ్ చేస్తూ, ఫీల్డు లెవెల్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలివ్వాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. గతేడాది గుడి లోపల అభిషేకం జరుగుతుంటే భక్తులను ఆపడం వల్ల కొంత తోపులాట జరిగిందని, అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా పలు ఏర్పాట్లు చేయాలని, డీజే సౌండ్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందని, ఇబ్బందులు లేనంత వరకు సౌండ్ పెట్టుకుని ఆట పాట డాన్స్ లు చేసుకోవాలన్నారు. బల్కంపేట శ్రీ ఎల్లమ్మ కళ్యాణం విజయవంతం చేయడానికి స్థానికులంతా ప్రత్యేక సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్ఎల్ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు, కార్పొరేటర్ సరళ, పోలీస్, రెవిన్యూ, ఆర్ అండ్ బీ, ఎండోమెంట్, ఎలక్ట్రిసిటీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Census Schedule: జనాభా లెక్కల తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఎప్పుడంటే