Census Schedule: యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనగణన తేదీలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రెండు దశల్లో జనాభా లెక్కలు జరుగుతాయని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. 2026 అక్టోబర్ 1న తొలి దశ, 2027 మార్చి1 నుంచి రెండవ దశ జనగణన ప్రారంభమవుతాయని వెల్లడించింది. మొదటి దశను ‘హౌస్‌లిస్టింగ్ ఆపరేషన్’ (HLO) అని కూడా పిలుస్తారు. ఆస్తులు, కుటుంబ ఆదాయం, ఇంటి వివరాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. కీలకమైన రెండవ దశలో, జనాభా గణన (PE) జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఇంట్లో నివసిస్తున్న వ్యక్తుల అందరి సమాచారాన్ని తెలుసుకుంటారు. నివసిస్తున్న సభ్యుల సంఖ్య, వారి సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని కూడా అధికారులు సేకరించనున్నారు.
మంచు ప్రభావిత కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలో 2026 అక్టోబర్ 1న రాత్రి 00:00 (అర్ధరాత్రి) గంటల నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయని కేంద్రం వెల్లడించింది. ఈ జాబితాలో లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరఖండ్ ఉన్నాయి. మొట్టమొదటిసారి డిజిటల్ రూపంలో జనాభా లెక్కలు జరగనున్నాయి. వ్యక్తులు ఇంటి వద్దే ఉండి సమాధానం ఇచ్చే వీలుంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి జన గణనలో భాగంగా కుల గణనను కూడా చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్ నెలలోనే ప్రకటించారు. 2027 జన గణన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read this- Seethaka on KTR: కవితతో పోటీ.. అరెస్ట్ కోసం కేటీఆర్ తాపత్రయం.. మంత్రి సీతక్క
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. జనాభా లెక్కల తర్వాత ఈ బిల్లును పరిశీలించే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత, డీలిమిటేషన్‌పై దృష్టిసారించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను ఖరారు చేసి, నియోజకవర్గాల పరిధిని నిర్ణయించే అవకాశం ఉంటుంది. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు డీలిమిటేషన్‌ను స్తంభింపజేశారు. ఆ తర్వాత, 2001లో జనాభా లెక్కలు చేపట్టినప్పటికీ దాని ప్రకారం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను మార్చలేదు. ఒక రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రాదేశిక సరిహద్దులను హేతుబద్ధీకరించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 2001లో 84వ సవరణ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం,2026 తర్వాత మొదటి జన గణన వరకు డీలిమిటేషన్‌ను స్తంభింపజేయవచ్చు.
Read this- Pakistan News: పాక్‌లో గందరగోళం.. నిలిచిపోతున్న వాహనాలు