Ponguleti Srinivas Reddy: వరద సాయం కింద ఒక్కో జిల్లాకు కోటి రూపాయల ప్రత్యేక నిధులను సమకూర్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy)పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. గడిచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని, వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Also Read: Leopard Attack: శ్రీశైలంలో చిరుత కలకలం.. చిన్నారిని ఈడ్చుకెళ్లి.. ఊరి చివర వదిలేసింది!
24 గంటల్లో రెడ్ అలర్ట్
గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్‌గా ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలన్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.