Leopard Attack: శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుత కలకలం రేపింది. కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతుల కుమార్తె అంజమ్మ (3)పై చిరుత దాడికి తెగబడింది. బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి బాలిక నిద్రిస్తుండగా సమీపంలోని అడవి నుంచి చిరుత వారి వద్దకు వచ్చింది. బాలికను నోట కరచుకుని గ్రామ శివారులోని పొదలవైపు ఈడ్చుకెళ్లింది.
చిరుత తన బిడ్డను ఎత్తుకెళ్లడాన్ని గమనించిన తండ్రి అంజయ్య కేకలు వేస్తూ చిరుతను వెంబడించాడు. దీంతో అది భయపడి చిన్నారిని వదిలేసి పారిపోయింది. ఈ దాడిలో చిన్నారి తల, పొట్టపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.
Also Read: Watch Video: క్లాస్ రూమ్‌లో విషాదం.. ఫ్రెండ్స్ కళ్లెదుటే మరణించిన విద్యార్థి.. వీడియో వైరల్!
చిరుత దాడి సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు గ్రామాన్ని సందర్శించారు. చిరుత సంచారంపై నిఘా పెట్టామని.. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనతో స్థానిక చెంచు గిరిజనులు ఆందోళనకు దిగారు. గత 70 ఏళ్లుగా చిన్నారుట్ల గూడెంలో నివసిస్తున్నప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం-దోర్నాల రహదారిపై గంటసేపు ఆర్టీసీ బస్సులు, వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. అధికారులు చర్చలు జరిపి విద్యుత్ సౌకర్యం కల్పింస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమింపజేశారు.