Jogulamba Temple: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
మహా గౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు
గద్వాల, స్వేచ్ఛ: దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ ఆలయం (Jogulamba Temple), బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. మంత్రి వెంట ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరి శైలజ రామయ్యర్ కూడా ఉన్నారు. దర్శించుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు. కాగా, అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు మహా గౌరీ దేవీ అలంకారంలో అమ్మవారు భక్తులకు సోమవారం దర్శనం ఇస్తున్నారు.
Read Also- Crime News: కొడుక్కి 18 ఏళ్లు నిండడానికి ఒక్క రోజు ముందు.. తండ్రి పక్కా ప్లాన్
సోమవారం స్వామివారికి, అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి కొండా సురేఖ సమర్పించారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదటగా గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందించారు. అమ్మవారి జ్ఞాపికను కూడా అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి శాంతి కళ్యాణ మహోత్సవంలో మంత్రి, అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఆనందదాయకం: మంత్రి
గద్వాల సంస్థానం వారసుడు రాజా కృష్ణ రాంభూపాల్ ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఆనందదాయకమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘, గద్వాల సంస్థాన వారసుడు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్‌కి ట్రస్టీగా ఉంటారు. భవిష్యత్తులో వారి వారసులే దేవస్థానానికి ట్రస్టీలుగా కొనసాగుతారు. ఇప్పుడున్న పాలకమండలి గడువు పూర్తి కావడంతో త్వరలోనే కొత్త కమిటీ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలంపూర్ పట్టణాన్ని, ఆలయాల సముదాయాన్ని పర్యాట కేంద్రంగా, టూరిజం హబ్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటి దశలో రూ. 33 కోట్లు.. రెండో పేజ్‌లో రూ.24 కోట్లు, మూడవ దశలో రూ.345 కోట్లతో డీపీఆర్ రెడీ చేస్తున్నారు. ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దమే ప్రభుత్వ లక్ష్యం. ఆలయాలను అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల రాష్ట్రాలు నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీలో ఉన్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి పొలాలను ఆలయ అభివృద్ధికి ఎలా ఉపయోగించాలో చర్చిస్తాం’’ మంత్రి మంత్రి కొండా సురేఖ వివరించారు.