Jupally Krishna Rao: త్వరలోనే తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం(Heli Tourism) నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్(is my trip) సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్(Hderabad) కు హెలీ టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల మన పర్యాటక రంగం కూడా కొత్తమలుపు తిరుగుతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.
పర్యాటక ఆతిథ్యానికి తెలంగాణ
రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టారు. కొల్లాపూర్ నియోజకవర్గం అమరగిరిలో రూ. 45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్ నిర్మాణ పనులు, రూ. 1.60 కోట్లతో సోమశిల విఐపీ ఘాట్ – బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు మంత్రి జూపల్లి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… పర్యాటక ఆతిథ్యానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Also Read: NIMS Hospital: కరోనాలో నిమ్స్ ఆస్పత్రిలో బెడ్ల దందా.. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వెలుగులోకి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Redy) సారథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాటక ప్రాజెక్ట్ లు చేపడుతోందన్నారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత పదేండ్లలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందని, స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. తద్వారా ఉద్యోగ కల్పనతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయని, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తామన్నారు.
ఫ్లోటింగ్ జెట్టి ఏర్పాటు
అమరగిరి ఐలాండ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని, నీటి ప్రవాహం తగ్గినా, పర్యాటకులను ఐలాండ్ తీసుకువచ్చేలా ఫ్లోటింగ్ జెట్టి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొత్త పర్యాటక ప్రాజెక్ట్ ల అభివృద్ధి వల్ల పర్యాటకుల సందర్శన మరింత పెరగనుందన్నారు. సోమశిల- సిద్దేశ్వరం ఐకానిక్ బ్రిడ్జి(Iconic Bridge) నిర్మాణం పూర్తైతే దూరాభారం తగ్గడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి కల్వరాల నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Duddilla Sridhar Babu: లైఫ్ సైన్సెస్ రంగంలో.. రూ.54 వేల కోట్ల పెట్టుబడులు