Jupalli Krishna Rao: పర్యాటక–అతిథ్య రంగంలో అపార అవకాశాలున్నాయని, కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. నిథమ్ (National Institute of Tourism and Hospitality Management) లో జాతీయ క్రీడా వారోత్సవాలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ నెల 31 వరకు జరిగే వారోత్సవాల్లో ఆరోగ్యం, శ్రేయస్సు, సంస్థాభివృద్ధి అంశాలపై వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని సమూహ యోగాసనాలు, ధ్యానం చేశారు. ఈ శిబిరాన్ని నిథమ్ యోగా శిక్షకురాలు స్మృతి పాండే నిర్వహించారు.
క్యాంపస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
అనంతరం మంత్రి జూపల్లి కృష్షారావు నిథమ్ విద్యార్థులు, అధ్యాపకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. నిథమ్ ను అగ్రగామి సంస్థగా నిలిపేందుకు విద్యార్థులు, అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకులను ఆకర్షించేలా నిథమ్ ను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కొత్త విద్యాకార్యక్రమాలు, స్వల్పకాలిక, నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెట్టాలని, విద్యా–శిక్షణ పరిధిని విస్తరించాలని, ఉద్యోగ, పారిశ్రామికావకాశాలను విస్తరించాలని దిశానిర్ధేశం చేశారు. క్యాంపస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Campus Infrastructure), వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వం తరపున నిథమ్ కు సంపూర్ణ సహకారం అందిస్తామని, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ తో చర్చించి నిథమ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని డైరెక్టర్ కు సూచించారు.
Also Read: Viral News: బట్టలతో పనిలేని వింత యాత్ర.. షిప్‌లో 11 రోజుల పాటు.. నూలు పోగు లేకుండా..!
ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, ఆతిథ్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రముఖ పర్యాటక కేంద్రాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి, వాటికి ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. పర్యాటక కేంద్రాలకు కనెక్టివిటీ పెంచి, పర్యాటక వసతి, సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటక, ఆతిథ్య రంగంలో ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో నిథమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ, శ్రీకారా హాస్పిటల్స్ సీనియర్ డాక్టర్ పీఎల్ఎన్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Donald Trump: భారత్‌ను మళ్లీ గెలికేసిన ట్రంప్.. మళ్లీ అదే పాట.. ఇక మారవా?