Minister Sridhar Babu: డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమని వివరించారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. సచివాలయంలో మంగళవారం జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు.
రాష్ట్రం గ్లోబల్ హబ్ గా..
కృత్రిమ మేథ(AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT) లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని, రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోందన్నారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు తన చేయూతను అందిస్తోందని తెలిపారు. మరోవైపు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కు రాష్ట్రం గ్లోబల్ హబ్ గా మారిందన్నారు. డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించామన్నారు. పెట్టుబడి వ్యయం, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని, టెక్నాలజీ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తోందన్నారు.
Also Read: Coldrif Warning: చిన్నపిల్లల దగ్గుమందుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
వేములవాడకు సమీపంలో..
రాష్ట్రంలో గత రెండేళ్లుగా వేములవాడ(Vemulavada) కు సమీపంలోని 3 గ్రామాల్లో ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘యాక్సిలరేటింగ్ క్లైమేట్-రెసిలియెంట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ’ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చొరవ చూపాలని సంస్థ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం.కోదండరెడ్డి, రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, జర్మనీ రాయబార కార్యాలయం(న్యూఢిల్లీ) ఫుడ్, అగ్రికల్చర్ డివిజన్ హెడ్ వోల్కర్ క్లైమా, ఫ్రాన్ హోఫర్ హెచ్ హెచ్ ఐ ప్రతినిధులు డా.సెబాస్టియన్ బోస్సే, డా.రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Strange Incident: నా భార్య ఒక నాగిని.. రాత్రిళ్లు కాటు వేస్తోంది.. కలెక్టర్‌కు భర్త ఫిర్యాదు
