Coldrif Warning: రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్‌లు ఇవ్వొద్దు
ఐదేళ్ల లోపు వాళ్లకు కూడా అత్యవసరానికే
మోతాదుకు మించి సూచిస్తే చర్యలే
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ ఉత్తర్వులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రెండేళ్ల లోపు పసిపిల్లలకు దగ్గు సిరప్‌లను (Coldrif Warning) ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ సూచించారు. ఐదేళ్ల లోపు వాళ్లకు కూడా అత్యవసరానికి మాత్రమే వాడాల్సి ఉంటుందని, చాలా తక్కువ మోతాదును మాత్రమే సూచించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్‌లు వాడటం సురక్షితం కాదని ఆయన అప్రమత్తం చేశారు. దీంతో పాటు, తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన ‘కోల్డ్రిఫ్ సిరప్’ (Coldrif Syrup) కల్తీ అయ్యిందని, దాన్ని రాష్ట్రంలో ఎవరూ వాడొద్దని హెచ్చరించారు.
Read Also- Rangareddy: ఆ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్.. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అక్రమ వ్యాపారం!
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు, జిల్లా వైద్యాధికారులకు సర్క్యాలర్ పంపించారు. కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. చిన్నపిల్లల్లో వచ్చే సాధారణ దగ్గు, జలుబు చాలా వరకు వాటంతటవే తగ్గిపోతాయని, వీటికి మందులు అవసరం లేదన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు సిఫార్సు చేయకూడదని, వాటిని అమ్మవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే, డాక్టర్ల పర్యవేక్షణలోనే సరైన మోతాదులో, తక్కువ కాలం మాత్రమే వాడాలన్నారు. మందులకు బదులుగా పిల్లలకు ఎక్కువగా గోరువెచ్చని నీళ్లు, ద్రవపదార్థాలు ఇవ్వడం, విశ్రాంతి కల్పించడం వంటివి చేయాలని సూచనలు చేశారు.
Read Also- Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!
ఈ సిరప్ అసలే వాడొద్దు…
తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన స్రెసన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. ఈ సిరప్‌లో ప్రాణాంతకమైన డైఇథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం కల్తీ అయినట్లు ఆరోపణలు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. ఈ సిరప్ ఎవరి దగ్గరైనా ఉంటే, వెంటనే స్థానిక డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీని కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ హెచ్చరికలపై ప్రజల్లో, వైద్యుల్లో అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడొద్దని అధికారులు సూచించారు.
