రంగారెడ్డి బ్యూరో స్వేచ్చ: Lakshmi Devi Palli Reservoir: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆతర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను ఎన్నికల ప్రచారస్త్రంగా చేసుకుంది. తెలంగాణ ఉద్యమానికి ఊపందించి బీఆర్‌ఎస్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి సైతం ఈ రిజర్వాయర్ దోహదపడింది. అధికారంలోకి వచ్చాక హామీలతో కాలయాపన చేసిన గత ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డిజైన్‌ను మార్చి ఏకంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌నే పక్కన బెట్టింది. ఏండ్లతరబడిగా పోరాటాలు చేసిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజానీకం రిజర్వాయర్‌పై జరిగిన కుట్రలను చూసి నివ్వెరపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పురుడుపోసుకున్న ఈ రిజర్వాయర్‌ను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భుజాలకెత్తుకుంటోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు, ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడతామని స్పష్టత ఇచ్చారు. మరుగునపడిపోయిన రిజర్వాయర్ అంశం మళ్లీ పట్టాలెక్కుతుండడంతో ఈ ప్రాంత రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు బడ్జెట్‌లో రూ.1,715 కోట్ల కేటాయింపులు జరిపిన ప్రభుత్వం త్వరలోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం ప్రత్యేక కేటాయింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే బీజం:
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా నీరందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఉమ్మడి రాష్ట్రంలోనే బీజం పడింది. సముద్ర మట్టానికి 675 మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు జూరాల ప్రాజెక్టు నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని అప్పటి ఇంజనీర్లు రూపకల్పన చేశారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సర్వే కోసం నిధులను సైతం మంజూరు చేసింది. ఆతర్వాత ఈ ప్రాజెక్టు అంశం మరుగునపడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలమూరు ఎత్తిపోతల స్వరూపం పూర్తిగా మారిపోయింది.
Also Read: Koluvula Pandaga: అందాల పోటీలు నిర్వహిస్తే.. కడుపుమంట ఏల.. సీఎం రేవంత్ రెడ్డి
జూరాల ప్రాజెక్టు నుంచి నీటి లభ్యత ఇబ్బందిగా మారుతుందని భావించిన అప్పటి సీఎం కేసీఆర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకురావాలన్న సంకల్పంలో డిజైన్‌ను మార్పించారు. దీంతో మొదటి ప్రాధాన్యతగా ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చివరి రిజర్వాయర్‌గా వెనక్కి నెట్టబడింది. 60రోజుల్లో నిత్యం 1.5 టీఎంసీల చొప్పున 90 టీఎంసీల నీటిని తీసుకు వచ్చేలా కొత్త డిజైన్‌ను రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నార్లమూర్ వద్ద 8.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న అంజనగిరి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి ఏదుల వద్ద 6.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న వీరాంజనేయ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి వట్టెం వద్ద 15.27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి కర్వేన వద్ద 15.7 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కురుమూర్తి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి 16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి చివరగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నిర్మించేలా డిజైన్ చేశారు.
ఏళ్లతరబడిగా స్థానికుల ఉద్యమం:
షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడెం మండలంలో నిర్మించే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా కృష్ణా జలాల తరలింపు వల్ల షాద్ నగర్, పరిగి, తాండూర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 3 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉంది. పరిగి, షాద్ నగర్ ప్రాంతంలోనే 80 వేల ఎకరాల వరకు సాగు నీరు అందుతుంది. సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంతంలో సాగు ఇబ్బందులతోపాటు తాగు నీటి అవసరాలను సైతం తీర్చడంలోనూ ఈ రిజర్వాయర్ దోహదపడే అవకాశం ఉండగా ఇంతటి ప్రాధాన్యత గల రిజర్వాయర్ నిర్మాణంపై కేసీఆర్ ప్రభుత్వం శీతకన్నును ప్రదర్శించింది. 2018 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ప్రచారానికి వచ్చిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకుని మరీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
కానీ ఆతర్వాత అంతా షరామామూలే. గత ప్రభుత్వంలో ఆశించిన మేరలో ముందడుగు పడకపోవడంతో రిజర్వాయర్ నిర్మాణం కోసం వివిధ రాజకీయ పార్టీలు రైతులతో కలిసి ఏళ్లతరబడిగా ఆందోళన బాట పట్టాయి. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రైతుల పక్షాన నిర్వహించిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల, కోదండరాం, గద్దర్ వంటి నేతలు రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ఆందోళనలకు మద్దతిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క సైతం పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టు పనులను చేపడతామని హామీ ఇచ్చారు.
తెరపైకి ప్రాణహిత చేవెళ్ల:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథకం మళ్లీ తెరపైకి వస్తోంది. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 16.4 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా అప్పట్లో ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు పునరాకృతిలో భాగంగా గత ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలుగా మార్చింది. తాజాగా అప్పటి పథకానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర సర్కారు సిద్దమవుతుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నీటిని తరలించాలన్న డిమాండ్ ఈప్రాంత అధికారపార్టీ ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది.
Also Read: Ponnam Prabhakar: బిజెపిపై పొన్నం రుసరుస.. అడ్డుపడితే క్షమాపణ ఉండదంటూ..
మరోపక్క పాత డిజైన్ ప్రకారం జూరాల నుంచి కృష్ణా జలాలను తరలించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. దీనికంటే ముందుగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను కార్యరూపంలోకి తీసుకురావాలని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నారు. షాద్ నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, మనోహర్ రెడ్డిలు పలు సందర్భాల్లో ప్రభుత్వంలోని పెద్దలకు వినతి పత్రాలను అందజేశారు. రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులను విడుదల చేయించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టేలా వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్‌ను పూర్తి చేసి తీరుతాం: వీర్లపల్లి శంకర్, షాద్ నగర్ ఎమ్మెల్యే
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లల్లో నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్య గురించి పట్టించుకోలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌కు ముందడుకు పడింది. వచ్చే నాలుగేళ్లల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి రిజర్వాయర్‌ను పూర్తి చేసి తీరుతాం. పాలమూరు ఎత్తిపోతల, జూరాల నుంచి కృష్ణా జలాలను తరలించడమా? లేక ప్రాణహిత చేవెళ్ల నుంచి గోదావరి నీళ్లను జలాలను తరలించాలా! అన్న విషయంలో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.