TG Gurukula Schools: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భోజన వ్యవహారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆరు నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో, వంట కాంట్రాక్టర్లు ఐదు రోజులుగా సేవలను నిలిపివేసి సమ్మె చేస్తున్నారు. దీని కారణంగా దాదాపు వెయ్యికి పైగా గురుకులాల్లో వంట నిలిచిపోగా, సెలవులు ముగిసినా విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరుకాలేక, హాజరైన కొద్దిమందికి సరైన భోజనం అందించలేక నిర్వాహకులు తంటాలు పడుతున్నారు.
తెగే దాకా రావొద్దు..
దసరా సెలవులు ముగిసి ఈ నెల 3న గురుకులాలు ప్రారంభమైనప్పటికీ, వంట సమస్య కారణంగా విద్యార్థులు గురుకులాలకు చేరలేదు. వంట సమస్య తెగేదాకా పాఠశాలలకు రావద్దని ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. గురుకులా(Gurukula)లకు చేరిన కొద్దిమంది విద్యార్థులకు సమయానికి, మెనూ ప్రకారం వంట చేసి పెట్టలేక ప్రిన్సిపాల్స్(Prinicipal), వార్డెన్లు సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. వంట కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేస్తుండటంతో, విద్యార్థులకు భోజనం అందించేందుకు పలుచోట్ల పారిశుద్ధ్య సిబ్బందితో పాటు విద్యార్థులతో కూడా వంట చేయిస్తున్నట్లు సమాచారం.
Also Read: Hydra Commissioner: ప్రజావాణి ఫిర్యాదులపై.. హైడ్రా కమిషనర్ పర్యటన
పెను భారం
మహాత్మా జ్యోతి బాఫూలే, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకులాలకు కూరగాయలు, కిరాణం సామాగ్రి, మాంసం, పండ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. అప్పులపాలైన కాంట్రాక్టర్లు విధిలేక సేవలు నిలిపివేశామని చెబుతున్నారు. పెండింగ్ బిల్లులతో పాటు, పాత టెండర్ (2024 జూన్) ప్రకారం పాత ధరలు అమలులో ఉండగా, కొత్త మెనూ ప్రకారం వంట చేయాల్సి రావడం తమకు పెను భారంగా మారిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉదయం 7 గంటలకే టిఫిన్ అందించాలంటే రాత్రి అదనంగా కార్మికులను పెంచాల్సి వస్తోందని, దీంతో ఆర్థిక భారం, పని భారం రెట్టింపు అవుతోందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
వేతనాల్లేవ్..
కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో, వారి వద్ద పనిచేసే వంట కార్మికులకు వేతనాలు అందడం లేదు. ఏ పూటకాపూట పని చేసుకుని జీవించే వేలాదిమంది కార్మికులు వేతనాలు లేక పండుగ పూట పస్తులు ఉన్న దయనీయ పరిస్థితి నెలకొంది. కొంతమంది కాంట్రాక్టర్లు ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ముఖ్యంగా ఎస్సీ డిపార్ట్‌మెంట్‌లోని హాస్టల్స్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ వంట కార్మికులకు ఏకంగా 13 నెలలుగా వేతనాలందకపోవడం గమనార్హం. పెండింగ్ బిల్లులు చెల్లించి, పెరిగిన మెనూ ప్రకారం తగిన ఛార్జీలు పెంచే వరకు సేవలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన బాట పడతామని రాష్ట్ర గురుకుల పాఠశాలల వంట కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
Also Read: Kiran Abbavaram: తెలుగు హీరోలకు తమిళనాడులో థియేటర్లు దొరకవా?.. ఆ హీరో చెప్పింది నిజమేనా?
