Rangam Bhavishyavani: హైదరాబాద్‌లో నెల రోజులపాటు భక్తులను ఆధ్యాత్మికంలో ముంచెత్తిన ఆషాడ బోనాల (Ashada Bonalu) జాతర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 24న గోల్కొండ (Golconda) జగదాంబ అమ్మవారికి తొమ్మిదవ బోనం, పూజ సమర్పణతో ఈ ఏడాది జాతర అధికారికంగా ముగియనుంది. సోమవారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి దేవాలయం ఆవరణలో నిర్వహించిన ‘రంగం’ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. అందరినీ తాను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, వ్యాధుల నివారణ వంటి అంశాలపై పలువురు పెద్దలు అమ్మవారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన అంబారిపై అమ్మవారి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మీరాలం మహంకాళి అమ్మవారి దేవాలయం ఆవరణలోనూ ‘రంగం’ కార్యక్రమం జరిగింది.
Also Read: Singareni Warning: బూటకపు జర్నలిస్టుపై చట్టపరమైన చర్యలు..
ఘనంగా సాగిన బోనాలు..
గత నెల 20న గోల్కొండ (Golconda) కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాల సందడి మొదలైంది. ఆ తరువాత ప్రతి ఆది, గురు వారాల్లో భక్తులు గోల్కొండ జగదాంబికా అమ్మవారికి ఘనంగా బోనాలు, తొట్టెల, నైవేద్యం, ఒడిబియ్యం, రక్తబలి వంటివి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోల్కొండలో జరిగిన ఈ బోనాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరు కావడం విశేషం. బోనాల ఏర్పాట్ల కోసం ఈసారి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. నగరంలోని దాదాపు అన్ని దేవాలయాలకు చెక్కులు పంపిణీ చేసి, బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంది. జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ సంయుక్తంగా తొట్టెల, బోనాల ఊరేగింపులు, ఫలహారం బండి ఊరేగింపులు ప్రశాంతంగా, ఘనంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు చేపట్టాయి. ఈ నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించి, జాతరను విజయవంతంగా నిర్వహించారు.
సంచలన వ్యాఖ్యలు..
జూలై 14న ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆవరణలో జరిగిన ‘రంగం’ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ, తాను రక్తబలి కోరుతున్నానని, పిల్లలను తల్లిదండ్రులు గాలికి వదిలేస్తున్నా తాను అండగా ఉంటూ కాపాడుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20న పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయం ఆవరణలో బోనాలు, తొట్టెల ఊరేగింపులు ఘనంగా జరిగాయి. సోమవారం లాల్ దర్వాజా దేవాలయంతో పాటు కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ, మీరాలంలోని మహంకాళి, హుమాయున్ నగర్ సమీపంలోని పోచమ్మ బస్తీలోని పోచమ్మ సహిత విజయ కనకదుర్గ దేవాలయంలో సాయంత్రం ‘రంగం’ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ గురువారం గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి జరిగే తొమ్మిదవ బోనం, తొమ్మిదవ పూజ కార్యక్రమంతో ఈ సంవత్సరపు బోనాల జాతరకు తెరపడనుంది.
Also Read: Perni Nani: చీకట్లో కన్నుకొట్టి కనిపించకుండా పోయిన పేర్ని నాని!