Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు భారీగా నమోదు అయ్యాయి. నామినేషన్ల లెక్క తేలింది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు దాఖలు చేయగా.. 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు వేశారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 282 పంచాయతీలకు 2,116 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి. 52 పంచాయతీలకు గాను 288 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు.
డిసెంబర్14న పోలింగ్
రెండో విడుత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గురువారం వినతులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన అప్పీళ్లను పరిష్కరిస్తారు. 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడించనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 14న పోలింగ్ నిర్వహించి, అదేరోజు విజేతలను ప్రకటించనున్నారు.
Also Read: Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై నీలినిడలు.. అనుమానాలు ఇవే!
ముగిసిన మొదటి విడుత నామినేషన్ల ఉపసంహరణ
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం ముగిసింది. అధికారులు పోటీలో నిలిచే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ఖరారు చేశారు. అయితే, అన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు రాకపోవడంతో మొదటి విడుతలో ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి? ఎంత మంది బరిలో నిలిచారనేది పూర్తి వివరాలు అధికారులకు రాలేదని సమాచారం. అర్ధరాత్రి వరకు జిల్లాల వారీగా అభ్యర్థుల లిస్ట్ తీసుకున్నారు. దీనిపై గురువారం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపులు చేస్తున్నారు.
బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేసే అవకాశం
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండటంతో అభ్యర్థులకు వారి పేర్లలోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేటాయించిన గుర్తులను ఇస్తున్నట్లు సమాచారం. అభ్యర్థులు నామినేషన్ పత్రంలో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే వారికి బ్యాలెట్ పేపర్‌లో స్థానం కేటాయిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఇంటిపేరును ముందుగా, మరికొందరు తమ పేరును ముందుగా పేర్కొనడం ద్వారా బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. బ్యాలెట్లో నోటా గుర్తు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముద్రించి ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Panchayat Elections: వేడెక్కుతున్న పల్లె రాజకీయం.. సర్వశక్తులు ఒడ్డుతున్న ఆశావహులు
